న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. ఓ మహిళ అత్యంత కిరాతకంగా హత్యకు  గురైంది. మహిళ తల, ఇతర శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి కనిపించాయి. ఈ సంఘటన ఢిల్లీలోని అలీపూర్ లో జరిగింది.

మహిళ శరీర భాగాలను కొన్నింటిని సంచీలో కుక్కారు. తలతో పాటు ఇతర శరీర భాగాలు నిర్మానుష్యమైన స్థలంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయని పోలీసులు చెప్పారు. 

అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి సోమవారంనాడు అక్కడ సంచీ పడి ఉన్న విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. కొన్ని శరీర భాగాలపై గాయాలు కనిపించాయని పోలీసులు అంటున్నారు. కుక్కలు గీరి, కొరికినట్లు మచ్చలు ఉన్నాయని అంటున్నారు.

 శరీర భాగాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.