న్యూఢిల్లీ: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై బిజెపి ఉన్నావో ఎంపీ సాక్షి మహరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్ ఓవైసీ తమకు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా సాయం చేస్తారని ఆయన అన్నారు.  మజ్లీస్ పోటీ చేయడం వల్ల ఆ రెండు రాష్ట్రాల్లో తమకు కలిసి వస్తుందని ఆయన అన్నారు. 

అది దేవుడి దయ అని, దేవుడు ఆయనకు బలాన్ని ఇచ్చాడని, ఆయన తమకు బీహార్ లో సాయం చేశారని, యూపీలోనూ సాయం చేశారని, ఇప్పుడు బెంగాల్ లో కూడా సహాయం చేస్తారని సాక్షి మహరాజ్ అన్నారు.

బీహార్ ఎన్నికల్లో తమ మజ్లీస్ పార్టీ సత్తా చాటడంతో తాము పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా పోటీ చేస్తామని ఓవైసీ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరగనున్నాయి. 

నిరుడు అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎంఐఎం ఐదు స్థానాలను గెలుచుకుంది. ఇతర నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా బిజెపి- జెడియూ విజయానికి దోహదపడిందనే విశ్లేషణలు జరిగాయి. దీంతో ఓవైసీని కాంగ్రెసు, జెడియు నేతలు బిజెపి బీ టీమ్ గా అభివర్ణించారు. 

నిరుడు డిసెంబర్ ఓవైసీ సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) చీఫ్ ఓంప్రకాష్ రాజ్భర్ ను కలిశారు. తాము ఉత్తరప్రదేశ్ లో పోటీ చేస్తామని ఈ సందర్భంగా ఓవైసీ చెప్పారు. 

ఓవైసీ మంగళవారంనాడు వారణాసి వెళ్లారు. ఎస్బీఎస్పీ, ఎంఐఎం, ఇతర చిన్నపార్టీలతో కలిసి భాగిదారి సంకల్ప్ మోర్చాను ఏర్పాటు చేసినట్లు, ఈ మోర్చా 2022లో జరిగే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. 

ఎన్నికల వ్యూహరచన కోసం ఓవైసీ ఈ నెలారంభంలో కోల్ కతాకు సందర్శించారు. బిజెపికి సాయం చేయడానికే ఓవైసీ తన ఎంఐఎంను పోటీకి దించుతున్నారని తృణమూల్ కాంగ్రెస్ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు..