ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ స్వాతి మలివాల్ తన టీమ్ తో కలిసి రోడ్డుపై నిలబడి ఉండగా ఓ కారులో వచ్చిన వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె చేతి వేళ్లు కిటికీలో ఇరుక్కుపోయినా కారును పోనిచ్చాడు. ఇది దేశ వ్యాప్తంగా చర్చనీయాాంశం అయ్యింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా ఒకటి బయటకు వచ్చింది. 

ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ కు రాజధాని వీధుల్లో ఎదురైన ఘటన దేశ మొత్తం సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. తాగిన మత్తులో ఉన్న డ్రైవర్ మహిళా కమిషన్ చీఫ్ తో జరిపిన సంభాషణ, ఆమెకు ఎదురైన అనుభవానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. 

ఢిల్లీలో మహిళల భద్రత ఎలా ఉందో స్వయంగా పరీక్షించేందుకు స్వాతి మలివాల్ తన టీమ్ కలిసి బుధవారం తెల్లవారుజామున వీధుల్లోకి 3 గంటల ప్రాంతంలో ఎయిమ్స్ సమీపంలోని రోడ్డు పక్కన నిలబడి ఉన్నారు. ఈ సమయంలో ఓ కారు వచ్చి ఆగింది. అందులో ఉన్న డ్రైవర్ హరీష్ చంద్ర మత్తులో ఉన్నాడు. ఆమెతో మాట్లాడాడు. అసభ్యంగా ప్రవర్తించాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ అంతా ఆమె టీమ్ అతడికి తెలియకుండా వీడియో తీసింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Scroll to load tweet…

స్వాతి మలివాల్ నిలబడి ఉన్న చోటు దగ్గరకు కారు వచ్చి ఆగింది. అందులో డ్రైవర్ ఆమెతో ఏదో మాట్లాడాడు. ‘‘సారీ.. మీ మాట వినిపించడం లేదు. నన్ను ఎక్కడ దింపుతావు ? నేను ఇంటికి వెళ్లాలి. నా బంధువులు వస్తున్నారు’’ అని ఆమె హరీష్ చంద్రతో గట్టిగా అనడం ఆ వీడియోలో కనిపిస్తోంది. తరువాత ఆమె కారుకు దూరంగా అడుగులు వేశారు. దీంతో డ్రైవర్ కోపంతో కారును తీసుకొని వెళ్లిపోయాడు. 

కానీ కొంత సమయం తరువాత ఆ కారు యూ టర్న్ తీసుకుని మళ్లీ అక్కడికి వచ్చింది. దీంతో మళ్లీ ఆమె ఆగ్రహంతో ‘‘నన్ను ఎక్కడ దింపాలని ప్లాన్ చేస్తున్నావు? మీరు రావడం ఇది రెండోసారి. ఇది నాకు వద్దు అని పదేపదే చెబుతున్నా’’ అని చెప్పారు. తరువాత ఆమె డ్రైవర్ కూర్చున సీటు వైపు వెళ్లారు. కిటీకి ద్వారా అతడితో మాట్లాడారు. ఆ సమయంలో ఆమె మాట్లాడుతుండగానే అద్దాలు ఎక్కించుకొని కారును పోనిచ్చాడు. దీంతో స్వాతి మలివాల్ చేతి వేళ్లు ఆ కిటీకిలో ఇరుక్కుపోయాయి. ఒక్క సారిగా ఆమె అరుస్తూ కొంత దూరం కారుతో పాటే పరిగెత్తాల్సి వచ్చింది. తరువాత బలవంతంగా వేళ్లను వెనక్కి లాక్కున్నారు. ఈ పరిణామాలన్నీ ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. 

ఈ ఘటనపై మలివాల్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదును అందుకున్న 22 నిమిషాల్లోనే హరీష్ చంద్ర (47)ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘‘ స్వాతి మలివాల్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు బాలెనో కారును 22 నిమిషాల్లోనే అదుపులోకి తీసుకున్నారు. సంబంధిత సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది’’ అని ఢిల్లీ పోలీసులు గురువారం ట్వీట్ చేశారు.

దీనిపై స్వాతి మాలివార్ మాట్లాడుతూ.. ఇది నిజంగా భయానక సంఘటన అని అన్నారు. తన టీమ్ జోక్యం చేసుకోకపోతే తాను కూడా మరో అంజలి అయ్యేదానిని అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ దేవుడు ప్రాణాలను కాపాడాడు. ఢిల్లీలో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కు భద్రత లేకపోతే సామాన్య మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి’’ అని ఆమె ట్వీట్ చేశారు. తన చేయి కారు కిటికీలో ఇరుక్కుపోయిందని, తనను 15 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లారని స్వాతి మలివాల్ ఆరోపించారు.