సారాంశం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉద్యోగులతో వీడియో కాల్‌లో బాస్ శివాలెత్తిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. టార్గెట్లు ఏవంటూ మండిపడ్డారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆ అధికారిపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యాక్షన్ తీసుకుంది.
 

న్యూఢిల్లీ: పని చేసే ప్రాంతం ఆరోగ్యకరంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అలాగైతేనే ఉత్పాదకత కూడా మెరుగ్గా ఉంటుందని దిగ్గజ సంస్థలు భావిస్తాయి కూడా. కానీ, దురదృష్టవశాత్తు క్రింది శ్రేణుల్లో ఈ సంస్కృతి మాయమైపోతుంది. చాలా సంస్థల్లో తరుచూ బాస్ ఫైర్ కావడం.. ఉద్యోగులు మానసిక ఒత్తిళ్లకు గురవడం సాధారణంగా మారిపోయింది. ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.

హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగులతో వారి బాస్ వీడియో కాల్‌ మీటింగ్‌లో శివాలెత్తాడు. వర్క్ స్టేటస్, టార్గెట్లను చర్చిస్తూ ఫైర్ అయ్యాడు. హెచ్‌ఆర్‌తో మెమో కూడా ఇప్పిస్తానని వార్నింగ్ ఇచ్చాడు. వివరణ ఇస్తున్న ఉద్యోగులను ఆయన పలుమార్లు షట్ అప్ అంటూ కటువుగా మాట్లాడాడు. ఈ వీడియో కాల్ మొత్తాన్ని ఓ వ్యక్తి రికార్డు చేశాడు.

ఈ వీడియోను ఓ వ్యక్తి లింక్డ్ ఇన్ ‌లో పోస్టు చేశారు. అంతే వీడియో వైరల్ అయింది. దాని నుంచి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనూ ఇది ప్రత్యక్షమైంది. నెటిజన్లు ఈ వీడియోపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. టాక్సిక్ వర్క్ కల్చర్ గురించి తీవ్ర వ్యతిరేకత తెలిపారు. కఠినమైన కార్మిక చట్టాలు మన దేశంలో అవసరం ఉన్నాయని అభిప్రాయపడ్డారు. పై నుంచి కింది వరకు సంస్థల్లో అన్ని విభాగాల్లో ఆరోగ్యకర వాతావరణం ఉండేలా చట్టాలు తీసుకురావాలని పేర్కొన్నారు.

ఈ వీడియో వైరల్ అయిన తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా యాక్షన్ తీసుకుంది. ఉద్యోగులపై మండిపడ్డ కోల్‌కతాలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అధికారిని సస్పెండ్ చేసినట్టు తెలిపింది. ప్రాథమిక విచారణ తర్వాత తాము ఆ అధికారిని సస్పెండ్ చేస్తున్నట్టు వివరించింది. బ్యాంక్ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా సమగ్ర దర్యాప్తునూ నిర్వహిస్తామని బ్యాంక్ రెస్పాండ్ అయింది. 

Also Read: Odisha Train Tragedy: లోకో పైలట్ల స్టేట్‌మెంట్లు ఇవే.. ట్రైన్ స్పీడ్, సిగ్నల్స్ పై స్పష్టత

తమ ఉద్యోగుల డిగ్నిటీని కాపాడుతామని, కింది ఉద్యోగుల పట్ల దురుసుగా వ్యవహరిస్తే ఉదాసీనత వహించబోమని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్పష్టం చేసింది.