తన ప్లాస్మాను దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని నటి, ఎంపీ సుమలత అంబరీష్ ప్రకటించారు. తాను కరోనా నుంచి కోలుకున్నానని, ప్లాస్మా దానానికై వైద్యుల అనుమతి కోసం ఎదురు చూస్తున్నానని ఆమె చెప్పారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.

 ‘‘కరోనా నుంచి కోలుకున్న తరువాత తాము 28 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ తరువాత యాంటీజెన్ టెస్ట్ ద్వారా శరీరంలోని ఇమ్యూనిటీ, యాంటీబాడీస్ స్థాయిని నిర్థారించాల్సి ఉంది. ఒకవేళ శరీరంలో యాంటీబాడీస్ అధికంగా ఉన్నట్లయితే.. ప్లాస్మా దానం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.’’ అని సుమలత పేర్కొన్నారు.

 

కాగా.. ఇటీవల సుమలతకు కరోనా సోకిన విషయం తెలిసిందే. మూడు వారాల క్రితం సుమలతకు వైరస్‌ లక్షణాలు కనిపించటంతో చెక్‌ చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. తన నియోజిక వర్గంలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా సుమలతకు వైరస్‌ సోకిందని భావిస్తున్నారు. అయితే తనకు పాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంటనే క్వారెంటైన్‌లోకి వెళ్లిన సుమలత, తనను కలిసిన వారందరూ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు.

కొద్ది రోజులుగా డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న సుమలత, ఇటీవల మరోసారి టెస్ట్ చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. సుమలతకు నెగెటివ్ రావటంతో అభిమానులు ఇండస్ట్రీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నారు.