హరిద్వార్‌లోని ధరమ్ సంసద్‌లో ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషపూరితంగా చేసిన ప్రసంగాలను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ ఖండించారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేసే వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
హరిద్వార్‌లోని ధరమ్ సంసద్‌లో ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషపూరితంగా చేసిన ప్రసంగాలను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) నాయకుడు ఇంద్రేష్ కుమార్ (indresh kumar) ఖండించారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేసే వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ ప్రసంగాలపై ఆయన అభిప్రాయలను గురువారం వెల్లడించారు.
హరిద్వార్ (haridwar), ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ (raypur) లో జరిగిన ధర్మ సంసద్‌లో ముస్లిం సమాజంపై వ్యాఖ్యలు చేసిన వారిని చట్ట ప్రకారం ఎలాంటి మినహాయింపులు లేకుండా శిక్షించాలని అన్నారు. “ ఇలాంటి ద్వేషపూరిత ప్రసంగం ఖండించదగినది. దీనికి కారణమైన వారిని చట్ట ప్రకారం తప్పనిసరిగా శిక్షించాలి. ఎలాంటి మినహాయింపులను పరిగణలోకి తీసుకోకూడదు ‘‘ అని ఆయన ఓ మీడియా సంస్థతో తెలిపారు. సమాజాన్ని మతోన్మాదంగా విభజించడం మానుకోవాలని ఆయన రాజకీయ నాయకులను కోరారు. సోదర భావంతో అభివృద్ధి చేసే రాజకీయాలు పాటించాలని కోరారు.
మహాత్మా గాంధీ హత్యపై ఆర్‌ఎస్‌ఎస్‌ను లక్ష్యంగా వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలపై ఇంద్రేష్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. మహాత్మా గాంధీ (mahatma gandi) హత్యకు 60 ఏళ్లుగా ఆర్‌ఎస్‌ఎస్, దాని సిద్ధాంతాలే కారణమని వారు ఆరోపిస్తున్నారని అన్నారు. అయితే దశాబ్దాలుగా అధికారంలో ఉన్న పార్టీలు వాటిని ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. మహాత్మాగాంధీని చంపింది ఒక హిందుత్వవాది అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఇంద్రేష్ కుమార్ మాట్లాడారు. అలాంటి ప్రకటనలు కూడా విద్వేషపూరిత ప్రసంగం కిందకు వస్తాయని తెలిపారు. అయితే ఆయన ఎక్కడా రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించలేదు.
“అన్ని ద్వేషపూరిత ప్రసంగాలను ఒకే కోణంలో చూడాలి. ఒక చర్యలో, ఒక ప్రసంగంలో మధ్య తేడాను మనం గుర్తించలేము. అయితే రెండూ కూడా దాని స్వాభావం, సారాంశం ప్రకారం ద్వేషపూరితంగా, విభజించేవిగా ఉన్నాయి” అని సంఘ్ ఇంద్రేష్ కుమార్ నొక్కి చెప్పారు. ద్వేషపూరిత ప్రసంగాలు చేసే వారందరిపై కఠిన చర్యలు తీసుకోవడం ప్రస్తుతానికి ఆవశ్యకమని ఆయన స్పష్టం చేశారు. వ్యాఖ్యలు చేసిన వారు ఎంత పెద్ద వారైనా, ఎంత ప్రభావవంతమైన వారైనా ఏ పార్టీకి, వర్గానికి చెందిన వారైనా సరే వారు దోషే. వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
గతేడాది డిసెంబర్ 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు హరిద్వార్‌లో కొందరు సాధువులు ధరమ్ సంసద్ పేరిట ఓ ఆధ్యాత్మిక సదస్సు నిర్వహించారు. ఇందులో పలువురు వక్తలు ముస్లింల మారణహోమానికి పాల్పడాలని రెచ్చగొట్టేలా మాట్లాడారు. ముస్లిం వ్యక్తిని ప్రధాని కానివ్వరాదని, వారి జనాభా పెరగకుండా చూడాలని, వారిని సంహరించడానికి హిందు బ్రిగేడ్లు మెరుగైన ఆయుధాలు వాడాలని రెచ్చగొట్టుడు ప్రసంగాలు చేశారు. ఈ ప్రసంగాలకు చెందిన వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మిలిటరీ చీఫ్‌లు, రిటైర్డ్ న్యాయమూర్తులు, కార్యకర్తలు, అంతర్జాతీయ ప్రముఖులూ స్పందించి ఖండించారు. దీంతో ఈ సదస్సులోని విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన వారిపై ఉత్తరాఖండ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో యతి నర్సింగానంద్‌తో పాటు మరో 10 మంది పేర్లను ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
