Asianet News TeluguAsianet News Telugu

లైంగికంగా వేధించాడని మహిళా కోచ్ ఫిర్యాదు.. హర్యానా క్రీడా మంత్రి సందీప్‌ సింగ్‌పై కేసు నమోదు..

హర్యానా క్రీడా మంత్రి సందీప్ సింగ్‌పై పోలీసు కేసు నమోదైంది. హర్యానాకు చెందిన మహిళా జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ ఫిర్యాదును స్వీకరించిన చండీగఢ్ పోలీసులు సందీప్ సింగ్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. 

Haryana Sports Minister Sandeep Singh booked for sexually harassment
Author
First Published Jan 1, 2023, 11:49 AM IST

హర్యానా క్రీడా మంత్రి సందీప్ సింగ్‌పై పోలీసు కేసు నమోదైంది. హర్యానాకు చెందిన మహిళా జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ ఫిర్యాదును స్వీకరించిన చండీగఢ్ పోలీసులు సందీప్ సింగ్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఇక, సందీప్ సింగ్ ఒలింపియన్.. అలాగే భారత జాతీయ హాకీ జట్టు మాజీ కెప్టెన్‌. 2019లో కురుక్షేత్రలోని పెహోవా నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం హర్యానా క్రీడా శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే సందీప్ సింగ్‌పై మహిళా జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ లైంగిక వేధింపులు ఆరోపణలు చేశారు. 

చండీగఢ్‌లోని సందీప్ సింగ్ అధికారిక నివాసానికి వెళ్లిన సమయంలో అతడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా మహిళా జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ ఆరోపించారు. ఈ క్రమంలోనే శుక్రవారం చండీగఢ్ పోలీసు ప్రధాన కార్యాలయాన్ని వెళ్లిన ఆమె.. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనీషా చౌదరి, పోలీసు సూపరింటెండెంట్ శ్రుతి అరోరాలను కలిశారు. సందీప్‌ సింగ్‌పై ఫిర్యాదు చేశారు. ‘‘నాకు చండీగఢ్ పోలీసులపై పూర్తి నమ్మకం ఉంది. న్యాయమైన విచారణకు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. ఇక, బాధిత మహిళ.. సెప్టెంబర్‌లో జూనియర్ కోచ్‌గా రిక్రూట్ అయ్యారు. రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న మహిళను ప్రభుత్వ అత్యుత్తమ స్పోర్ట్స్ పర్సన్ పథకం కింద నియమించారు.

అయితే తనపై మహిళా కోచ్‌ చేసిన ఆరోపణలను మంత్రి సందీప్ సింగ్ ఖండించారు. ఈ ఆరోపణలను నిరాధారమైనదని కొట్టిపారేశారు. ఇందుకు స్వతంత్ర విచారణ జరిపించాలని కోరారు. 

ఇక, మహిళా కోచ్ ఫిర్యాదు  మేరకు శనివారం సెక్టార్ 26 పోలీస్ స్టేషన్‌లో సందీప్ సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై ఐపీసీ సెక్షన్‌లు 354 ( మహిళ నమ్రతను కించపరిచే ఉద్దేశ్యంతో ఆమెపై దాడి లేదా నేరపూరిత బలవంతం), 354A (లైంగిక వేధింపు), 354B (వస్త్రం విప్పే ఉద్దేశంతో మహిళపై దాడి చేయడం లేదా నేరపూరిత బలవంతం ఉపయోగించడం), 342 (తప్పుగా నిర్బంధించడం), 506 (నేరపూరిత బెదిరింపు)  సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios