హర్యానాలో ఓ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థికి ఊరి ప్రజలు రూ. 2.11 కోట్లు, ఒక ఎస్‌యూవీ కారు బహుమానంగా ఇచ్చారు. తద్వార ఎన్నిక అనంతరం సహోదర వాతావరణం కరిగిపోకుండా ఉండాలని, ఎప్పటిలాగే అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఈ గిఫ్ట్ ఇచ్చారు.
న్యూఢిల్లీ: నేడు ఎన్నికల్లో పోటీ చేయడం అంటే ఖరీదైన అంశంగా మారింది. ఎంపీ, ఎమ్మెల్యే పోటీలను పక్కన పెట్టండి గ్రామ స్థాయిలోనూ సర్పంచ్ ఎన్నిక ఇప్పుడు ఖరీదుగా మరింది. సర్పంచ్ పదవి కోసం కూడా లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. డబ్బుల పంపకం కూడా సర్వసాధారణమైపోయింది. చివరకు ఎన్నికల్లో ఓడిపోయాక డబ్బులు తిని ఓటెయ్యలేదనే శాపనార్థాలూ ఇప్పటికీ వినిపిస్తున్నాయి. కానీ, హర్యానాలో రోహతక్ జిల్లాలో చిది గ్రామ పరిస్థితులు మాత్రం ఊహించని రీతిలో భిన్నంగా ఉన్నాయి.
సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు తమ వారు.. తన అభిమానులు, శ్రేయోభిలాషులు, అలాగే క్యాంపెయిన్ బేస్ చేసుకుని అభ్యర్థులు తమకు దక్కే ఓట్లను లెక్కకడుతారు. గెలిచే అవకాశాలను చూసి మురిసిపోతారు. కానీ, ఓడితే.. చుట్టూ ఉన్నవారంతా ఒక్కసారి ఆప్తులు, అభిమానుల నుంచి అనుమానించదగ్గ వ్యక్తులుగా మారిపోతారు. ఒక వేళ ఓడిన అభ్యర్థి బలమైన నేత అయితే ఆ గ్రామ ప్రజలకూ ఎంతో కొంత నష్ట వాటిల్లినట్టే. ఈ లెక్కలు చిది గ్రామానికి సరిగ్గా తెలిసనట్టు ఉన్నాయి. అందుకే ఓడిపోయిన సర్పచ్ అభ్యర్థికి వారు ఊహించని బహుమానం ఇచ్చి ఆయన ఆదరణను నిలుపుకున్నారు.
Also Read: తల్లి ప్రేమ...పుట్టిన బిడ్డను చూసి చింపాంజీ ఎమోషనల్.. వీడియో వైరల్..!
నవంబర్ 12న చిదిలో గ్రామ పంచాయతికి ఎన్నికలు జరిగాయి. ఇందులో నవీన్ దలాల్ చేతిలో ధర్మపాల్ దలాల్ ఓడిపోయాడు. హోరాహోరీగా జరిగిన ఎన్నికలో 66 ఓట్లత పరాజయం పాలయ్యాడు. కానీ, గ్రామంలో సోదరభావం ఎప్పట్లాగే కొనసాగాలని ఓడిన వ్యక్తి మనసులో వ్యతిరేకత మొదలవ్వకుండా ఊరి ప్రజలు జాగ్రత్తపడ్డారు. ఓడిన ధర్మపాల్ దలాల్‌కు రూ. 2.11 కోట్ల డబ్బు, ఒక ఎస్‌యూవీ కారు బహుమానంగా ఇచ్చారు.
దీంతో ధర్మపాల్ దలాల్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తాను బ్లాక్ సమితి చైర్మన్‌గా 2000లో ఎన్నికయ్యానని, అప్పటి నుంచి ఈ ఏరియా అభివృద్ధి కోసం ఎంతో చేశానని ధర్మపాల్ దలాల్ తెలిపారు. ప్రతియేటా తమ గ్రామ స్కూల్‌లో టాపర్ లను సత్కరిస్తానని, విద్యార్థులు ఏది సాధించినా వారిని ప్రోత్సహిస్తున్నా అని వివరించారు. గ్రామానికి సంబంధించిన ప్రతి వేడుకలో పాలుపంచుకుంటానని తెలిపారు. కానీ, సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోవడంతో తన గుండె పగిలినంత పనైందని వివరించారు. కానీ, గ్రామ ప్రజలు తనకు ఊహించిన బహుమతి ఇచ్చి వారు తనపై ఆదరణ, అభిమానాన్ని చూపించారని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ఓటమి ని పరిగణనలోకి తీసుకోబోనని, ఎప్ప టిలాగే అభివృద్ధి పనులు చేస్తూ ఉంటానని వివరించారు.
