తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డలను తండ్రి అపురూపంగా చూసుకుంటాడు. తన ప్రాణాలు అడ్డం వేసైనా సరే.. తన బిడ్డలను కాపాడుకుంటాడు. అలాంటి తండ్రే.. తన బిడ్డల పట్ల యముడిగా మారాడు. ఒకరి తర్వాత మరోకరి వరసగా ఐదుగురు చిన్నారులను చంపేశాడు. ఈ దారుణ సంఘటన చండీగఢ్ లో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 జుమ్మా (38) హరియాణాలోని జింద్‌ జిల్లాలో తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. జూలై 23న తన ఇద్దరు పిల్లలు (11 ఏళ్లు, 7 ఏళ్లు) కనిపించడం లేదంటూ అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతకు మూడురోజుల ముందే పోలీసులు ఇద్దరు పిల్లల మృతదేహాలను అక్కడికి దగ్గర్లోని ఓ కాలువలో కనుగొన్నారు. అనుమానం వచ్చి ఆ మృతదేహాలను చూపించగా.. తన పిల్లలేనంటూ అతడు ఘొల్లుమన్నాడు. 

కానీ, పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. తన ఇద్దరు పిల్లల్ని తానే మత్తు మందు ఇచ్చి, కాలువలో తోసి హత్య చేశానని అంగీకరించాడు. అతడు నాలుగేళ్లలో ఇదే విధంగా తన తొలి ముగ్గురు పిల్లలను కూడా హత్య చేశాడు. వాళ్లవి ప్రమాదవశాత్తూ సంభవించిన మరణాలుగా చిత్రీకరించాడు. 

ఈ క్రమంలో ఆ పిల్లల తల్లిని మత్తు మందులకు బానిసగా మార్చాడు. ఇప్పుడు కూడా అతడి భార్య ఆరు నెలల గర్భవతి కావడం గమనార్హం. తాంత్రిక శక్తుల కోసమే అతడు ఈ ఘాతుకాలకు పాల్పడ్డాడని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.