Asianet News TeluguAsianet News Telugu

Agnipath: అగ్నిపథ్‌కు అప్లై చేస్తే సామాజిక బహిష్కరణే: హర్యానాలో పెద్దల నిర్ణయం

అగ్నిపథ్ స్కీంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసినా దానిపై వ్యతిరేకత తగ్గడం లేదు. హర్యానాలోని ఖాప్ నేతలు బుధవారం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అగ్నిపథ్ స్కీంకు దరఖాస్తు చేసుకున్నవారిని బహిష్కరిస్తామని, అధికార పార్టీ నేతలను, ఈ స్కీంకు మద్దతు తెలిపిన కార్పొరేట్ సంస్థలనూ బహిష్కరిస్తామని తెలిపారు.
 

haryana khap leaders boycott youth who apply for agnipath recruitment scheme
Author
New Delhi, First Published Jun 23, 2022, 12:56 PM IST

న్యూఢిల్లీ: భద్రతా బలగాల్లో చేరడానికి అగ్నిపథ్ స్కీంకు దరఖాస్తు చేసుకునే యువతను సామాజికంగా వెలి వేస్తామని హర్యానాలో కాప్ పంచాయతీ నేతలు ప్రకటించారు. అంతేకాదు, హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ జేజేపీ పార్టీల నేతలను బహిష్కరిస్తున్నట్టు వెల్లడించారు. అలాగే, ఈ స్కీంకు మద్దతు తెలిపిన కార్పొరేట్ కంపెనీలనూ కూడా బహిష్కరిస్తున్నట్టు తెలిపారు.

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మార్చేసింది. భద్రతా బలగాల్లో నియామకాల కోసం కొత్తగా అగ్నిపథ్ స్కీంను ప్రకటించింది. దీని ప్రకారం, ఈ స్కీం ద్వారా రిక్రూట్ అయినవారు కేవలం నాలుగేళ్లు మాత్రమే సైన్యంలో సేవలు అందించాలి. ఆ తర్వాత అందులో సుమారు 25 శాతం మందిని ఆర్మీలోకి తీసుకుని మిగితా 75 శాతం మందిని ఇంటికి పంపిస్తారు. ఈ స్కీం ప్రకటించగానే దేశవ్యాప్తంగా యువత నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో హింసాత్మక ఆందోళనలూ జరిగాయి. 

ఈ నేపథ్యంలోనే హర్యానా రోహతక్ జిల్లాలో సాంప్లా టౌన్‌లో బుధవారం ఓ సమావేశం నిర్వమించారు. ఈ సమావేశానికి హర్యానా, రాజస్తాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌ల నుంచి పలు ఖాప్‌లు, ఇతర కమ్యూనిటీ గ్రూపులు పాల్గొన్నాయి.అంతేకాదు, స్టూడెంట్ ఆర్గనైజేషన్‌ల సభ్యులూ ఇందులో పాల్గొన్నారు.

ధన్కర్ ఖాప్ హెడ్ ఓం ప్రకాశ్ ధన్కర్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆర్మీలో చేరడానికి అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీంకు దరఖాస్తు చేసుకున్న యువతను సామాజికంగా ఒంటరిని చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. అగ్నివీరుల పేరిట యువతను లేబర్లుగా నియమించుకునే విధానంగా ఉన్న అగ్నిపథ్ స్కీంను తాము వ్యతిరేకిస్తున్నామని వివరించారు.

సామాజికంగా ఒంటరి చేయడం అంటే బహిష్కరణే కదా అని అడగ్గా ఆ పెద్దాయన కాదన్నారు. తాము బహిష్కరణ అనే పదాన్ని ఉపయోగించడం లేదని, కానీ, అగ్నిపథ్ స్కీంకు అప్లై చేసుకున్నవారిని కమ్యూనిటీలు దూరం పెడతాయని వివరించారు.  అగ్నిపథ్ స్కీంను సపోర్ట్ చేసిన కార్పొరేట్ కంపెనీలు, రాజకీయ నేతలనూ తాము బహిష్కరిస్తామని తెలిపారు. రూ. 10వేలకు మించి ఈ కంపెనీల నుంచి ఏవీ కొనుగోలు చేయవద్దని ప్రజలను తాము కోరుతామని వివరించారు. 

తక్షణ డిమాండ్లపై ఓం ప్రకాశ్ ధన్కర్ మాట్లాడుతూ.. అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన యువతపై కేసులు పెట్టారని, ఆ కేసులన్నింటినీ వెంటనే బేషరతుగా ఎత్తేయాలని డిమాండ్ చేశారు. సాంప్లాలోని ఛోటు రామ్ ధామ్ దగ్గర పర్మనెంట్ ప్రొటెస్ట్ ఉంటుందని, కాబట్టి ప్రజలు తమ నిరసనలో పాల్గొనాలని పిలుపు ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios