చండీఘడ్: మాజీ మున్సిపల్ కౌన్సిలర్, బీజేపీ నేత హరీష్ శర్మ మృతిపై  పానీపట్ ఎస్పీ మనీషా చౌదరి సహా ఇద్దరు పోలీసులపై కేసు నమోదైంది.

మాజీ పానిపట్ కౌన్సిలర్ హరీష్ శర్మ కూతురి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.  ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు గాను రాష్ట్ర హోంమంత్రి అనిల్ విజ్ ఆదేశాల మేరకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు.

అడిషనల్ డీజీపీ సందీప్ కిర్వార్ నేతృత్వంలో ఈ కమిటి ఏర్పాటైంది. హరీష్ శర్మ కూతురి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని  హర్యానా డీజీపీ మనోజ్ యాదవ తెలిపారు. 

పానీపట్  ఎస్పీతో పాటు మరో ఇద్దరు పోలీసులు తన తండ్రిని వేధించారని ఆమె ఫిర్యాదు చేసినట్టుగా  డీజీపీ వివరించారు.

ఐపీసీ 306 సెక్షన్  తో పాటు ఐపీసీ 34 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పోలీసుల వేధింపులను భరించలేక హర్యానా మాజీ కౌన్సిలర్ కాలువలో దూకి ఆత్మహత్య  చేసుకొన్నాడు.  ఆదివారం నాడు కాలువ నుండి మృతదేహాన్ని వెలికితీశారు.

దీపావళిని పురస్కరించుకొని టపాకాయల విక్రయం సందర్భంగా  నిబంధనలను ఉల్లంఘించారని ఆయనపై కేసు నమోదైంది. అంతేకాదు ఈ విషయమై ప్రశ్నించిన పోలీసులపై హరీష్ దురుసుగా ప్రవర్తించాడని కేసు నమోదైంది.

హరీష్ శర్మ మృతికి కారణమైన పానీపట్ ఎస్పీతో పాటు ఇతర పోలీసులపై చర్యలు తీసుకొనేవరకు తాము అంత్యక్రియలు నిర్వహించబోమని 44వ నెంబర్ జాతీయ రహదారిపై డెడ్ బాడీ పెట్టి ఆందోళన చేశారు.

ఈ విషయమై భాద్యులపై చర్యలు తీసుకొంటామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో సోమవారం నాడు హరీష్ శర్మ అంత్యక్రియలు నిర్వహించారు.  ఈ  అంత్యక్రియల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.