Haryana Farmers: పంట కొనుగోలు ఆలస్యం కారణంగా హర్యానా రైతులు హైవేలను దిగ్బంధించారు. తమ వద్ద ఉత్పత్తులను నిల్వ చేయడానికి స్థలం లేదని పేర్కొంటూ, సేకరణ తేదీని ముందస్తుగా ఇవ్వాలని రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
Crop Purchase: ప్రభుత్వాలపై హర్యానా రైతన్నలు మరోసారి కన్నెర్రజేశారు. ఇప్పటికే తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం రైతులు పోరాడుతున్నారు. అనేక సార్లు ప్రభుత్వాలు గిట్టుబాటు ధరల గురించి రైతులకు హామీలు ఇస్తున్నాయి.. కానీ అవి కార్యరూపం దాల్చడంలేదు. ఈ క్రమంలోనే రైతులు తమ పంటల కోనుగోలు విషయంలో జరుగుతున్న జాప్యం గురించి ప్రశ్నిస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హర్యానకు చెందిన చాలా మంది రైతులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.
వివరాళ్లోకెళ్తే.. తాము పండించిన ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో జాప్యంపై ప్రణాళికాబద్ధంగా ఆందోళన ప్రారంభించిన రైతులు హర్యానాలోని కురుక్షేత్రలో జాతీయ రహదారి 44ను పూర్తిగా దిగ్బంధించారు. తమ వద్ద ఉత్పత్తులను నిల్వ చేయడానికి స్థలం లేదని పేర్కొంటూ, సేకరణ ముందస్తుగా జరపాలని రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.. లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఏజన్సీలు ఇంకా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో మండీలు లేక మార్కెట్‌లో తమ ఉత్పత్తులను చూసీచూడనట్లు పడిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. దీని ఫలితంగా అంబాలా, కైతాల్, ఇతర జిల్లాల్లోని ధాన్యం మార్కెట్‌లలో తేమ శాతం పెరగడం వల్ల వందల క్వింటాళ్ల వరి నిల్వలు నాశనమయ్యాయని పేర్కొంటున్నారు. భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
శుక్రవారం కురుక్షేత్ర జిల్లాలోని షహబాద్ వద్ద ఢిల్లీ నుండి చండీగఢ్‌కు కలిపే జాతీయ రహదారి-44ను రైతులు అడ్డుకోవడంతో వేలాది మంది ప్రయాణికులు ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకున్నారు. హర్యానా భారతీయ కిసాన్ యూనియన్ (చారుణి) అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చారుణి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 22 నుండి ప్రభుత్వం వరి సేకరణను ప్రారంభించకపోతే షహబాద్ సమీపంలో NH 44 ను అడ్డుకుంటామని బెదిరించారు. వర్షం మధ్య, వందలాది మంది రైతులు గుమిగూడి, పరిపాలనతో చర్చలు ఎటువంటి ఫలితం ఇవ్వకపోవడంతో నిరసనతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. “గత రెండు రోజులుగా వేలాది మంది రైతులు ఇప్పటికే తమ ఉత్పత్తులతో మండీలలో (ధాన్యం మార్కెట్‌లు) క్యాంపింగ్‌లో ఉన్నారు, కానీ ప్రభుత్వం కొనుగోళ్లను ప్రారంభించడానికి సిద్ధంగా లేదు. వర్షం కారణంగా ధాన్యం పడైపోయే అవకాశముంది. ఈ క్రమంలోనే వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలంటూ రహదారిని దిగ్బంధించడం మినహా మాకు వేరే మార్గం లేదు”అని సమావేశం అనంతరం రైతులను ఉద్దేశించి చారుణి అన్నారు.
కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించే వరకు దిగ్బంధనం కొనసాగుతుందన్నారు. భారీగా పోలీసులు మోహరించినప్పటికీ రైతులు తమ ట్రాక్టర్లతో బారికేడ్లను తొలగించి హైవేను దిగ్బంధించారు. కురుక్షేత్ర పోలీసు సూపరింటెండెంట్ సురీందర్ సింగ్ భోరియా మాట్లాడుతూ, ట్రాఫిక్‌ను NH 44 నుండి లింక్ రోడ్‌లకు మళ్లిస్తున్నామనీ, ఏదైనా అవాంఛనీయ సంఘటనలను ఎదుర్కోవటానికి పోలీసు మోహరింపు ఉందని చెప్పారు. కురుక్షేత్ర డిప్యూటీ కమిషనర్ శంతను శర్మ మాట్లాడుతూ "సమస్యకు పరిష్కారం త్వరలో కనుగొనబడుతుంది.. అందరికీ వెల్లడి చేయబడుతుంది" అని అన్నారు. ఇదిలావుండా, మేరీ-ఫసల్ మేరా బయోరా పోర్టల్‌లో నమోదు చేసిన ప్రకారం ప్రభుత్వ సంస్థలు అక్టోబర్ 1 నుండి సేకరణను ప్రారంభించాలనుకుంటున్నదని అధికారులు తెలిపారు.
