కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు గత కొన్ని రోజులుగా ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో రైతు గుండె ఆగిపోయింది.

ఢిల్లీ శివారులోని టిక్రి సరిహద్దులో మంగళవారం ఉదయం హర్యానాకు చెందిన ఓ యువ రైతు గుండెపోటుతో మృతిచెందారు. సోనెపట్‌కు చెందిన 32 ఏళ్ల అజయ్‌ మూర్‌ గత కొన్ని రోజులుగా ఆందోళనల్లో పాల్గొంటున్నారు.

ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం అజయ్‌ నిర్జీవంగా కన్పించడంతో తోటి రైతులు పోలీసులకు సమాచారమిచ్చారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం అజయ్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.   

ఆందోళనల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా అజయ్‌ రహదారిపైనే పడుకుంటున్నారు. తీవ్రమైన చలి కారణంగానే ఆయన మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అజయ్‌ మరణంపై కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు.

కాగా.. గతవారం ఇదే టిక్రి సరిహద్దులో పంజాబ్‌కు చెందిన ఓ 57ఏళ్ల రైతు గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఎముకలు కొరికే చలిని కూడా లెక్కచేయకుండా గత 12 రోజులుగా రైతన్నలు ఢిల్లీ శివారుల్లో ఆందోళన సాగిస్తున్నారు. ట్రాక్టర్లనే గుడారాలుగా మలుచుకుని.. రోడ్డుపైనే వంట చేసుకుంటూ నిరసన తెలుపుతున్నారు.