ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్టులో 45 తుపాకులతో ఓ జంట పట్టుబడింది. వీరు వియత్నాం నుంచి భారత్ కు వచ్చినట్లుగా తెలుస్తోంది. పట్టుబడ్డ తుపాకుల విలువ రూ.22 లక్షల వరకు వుంటుందని అంచనా.
ఇప్పటి వరకు మన విమానాశ్రయాల్లో బంగారం, మాదక ద్రవ్యాలు వంటి వాటిని పోలీసులు, కస్టమ్స్ అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో తొలిసారిగా ఎయిర్‌పోర్ట్‌లో ఏకంగా 45 తుపాకులతో ఓ జంట పట్టుబడింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. అరెస్ట్ అయిన జంటను జగ్‌జిత్ సింగ్, జస్విందర్ కౌర్‌లుగా గుర్తించారు. వీరు హర్యానా రాష్ట్రానికి చెందిన వారిగా తెలుస్తోంది. వీరి వెంట 17 నెలల చిన్నారి కూడా వుంది.
జూలై 10న జగ్‌జిత్ సింగ్ దంపతులు వియత్నాం నుంచి భారత్ కు వచ్చారు. ఈ క్రమంలో విమానాశ్రయంలో వీరిని తనిఖీ చేసిన కస్టమ్స్ అధికారులు రెండు బ్యాగుల్లో 45 తుపాకులు వున్నట్లు గుర్తించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ప్యారిస్ నుంచి వచ్చిన తన సోదరుడు వియత్నాంలో తనకు ఈ బ్యాగులను తనకు ఇచ్చినట్లు జగ్‌జత్ సింగ్ అధికారులకు వెల్లడించాడు. ఈ తుపాకుల విలువ రూ.22 లక్షల వరకు వుంటుందని అంచనా. అయితే ఈ జంట గతంలోనూ తుపాకులతో పట్టుబడినట్లుగా తెలుస్తోంది. టర్కీ నుంచి ఇండియాకు 25 లక్షలు తెస్తూ పట్టుబడ్డారు. జగ్‌జత్ సింగ్, జస్విందర్ కౌర్‌లపై పలు అభియోగాల కింద కేసు నమోదు చేసిన కస్టమ్ అధికారులు .. వారిని రిమాండ్ కు తరలించారు.