ఢిల్లీలో ఘర్షణల నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పందించారు. డిప్యూటీ కమీషనర్లు, పోలీస్ కమీషనర్లు, జిల్లా ఎస్పీలతో అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించిన ఆయన ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయ్ వర్ధన్. హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి, రాజీవ్ అరోరా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి), మనోజ్ యాదవ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన  ఆందోళనలు దేశాన్ని విస్మయపరిచాయి. ట్రాక్టర్ ర్యాలీలో భాగంగా రైతులంతా కిసాన్ గణతంత్ర పరేడ్‌కు బయలుదేరారు. టిక్రీ సరిహద్దు నుంచి ట్రాక్టర్లు ఢిల్లీలోకి ప్రవేశించాయి.

ఈ ర్యాలీలో రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. దేశ రాజధానిలో పరేడ్‌ చేపట్టారు. దీంతో పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది.

Also Read:ఢిల్లీలో టెన్షన్: అమిత్ షా ఆరా, ఇంటర్నెట్ సేవలు బంద్

బారికేడ్లను సైతం దాటుకుని రైతులు ర్యాలీగా బయలుదేరడంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో జలఫిరంగులను సైతం పోలీసులు సిద్ధం చేశారు.

ఈ క్రమంలో వేల ట్రాక్టర్లతో ఢిల్లీలోకి చొచ్చుకొచ్చిన రైతులు ఎర్రకోటను ముట్టడించారు. అనంతరం కోట శిఖరంపైకి ఎక్కి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ ఆందోళనలో పలువురు పోలీసులకూ గాయాలయ్యాయి.

ఇదే సమయంలో ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడవద్దని రైతు నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా మెట్రో స్టేషనలను అధికారులు మూసివేశారు.