హర్యానా: తల నరికేస్తానంటూ గొడ్డలితో హల్ చల్ చేశారు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్. హర్యానాలోని ఓ ప్రాంతంలో నిర్వహించిన జన్ ఆశీర్వాద్ యాత్రలో పాల్గొన్న సీఎం ఖట్టర్ కు బీజేపీ కార్యకర్త ఆయన తలపై కిరీటం పెట్టే ప్రయత్నం చేశారు. 

దాంతో కోపోద్రిక్తుడైన మనోహర్ లాల్ ఖట్టర్ తన చేతిలో ఉన్న గొడ్డలని ఆ వ్యక్తిపై ఝులిపిస్తూ తల నరికేస్తా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

జన్ ఆశీర్వాద్ యాత్రలో పాల్గొన్న సీఎం ఖట్టర్ పార్టీ కార్యకర్తలు బహుకరించిన గొడ్డలిని చేత్తో పట్టుకుని ప్రచార వాహణంపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఇంతలో ఆయన వెనుక ఉన్న బీజేపీ కార్యకర్త సీఎం తలపై వెండి కిరీటం పెట్టే ప్రయత్నం చేశాడు. దాంతో కోపోద్రిక్తుడైన సీఎం ఖట్టర్ ఏం చేస్తున్నావ్, తల నరికేస్తా అంటూ ఆ కార్యకర్తపై ఊగిపోయారు. 

సీఎం చేష్టలతో భయాందోళనకు గురైన ఆ బీజేపీ కార్యకర్త తప్పు జరిగింది క్షమించండంటూ వేడుకున్నారు. ఎవరైనా సరే.. తన తలపై కిరీటం పెట్టే ప్రయత్నం చేస్తే  కోపం వస్తుంది అంటూ సీఎం ఖట్టర్ వివరణ ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

ఇకపోతే మనోహర్ లాల్ ఖట్టర్ వీడియోపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా అయితే తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోని షేర్ చేశారు.

ఇకపోతే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మనోహర్ లాల్ ఖట్టర్ కు కొత్తేమీ కాదు. ఇటీవలే జమ్ముకశ్మీర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం బేటీ బచావో - బేటీ పడావో విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఖట్టర్ బీహార్ కు చెందిన అమ్మాయిని తన కోడలుగా తెచ్చుకుంటానని మన మంత్రి ఓపి ధనకర్ అన్నారని, కానీ ప్రజలు ఇప్పుడు కశ్మీర్ దారి పట్టారని ఖట్టర్ అన్నారు. 

కశ్మీర్ అంశంపై స్పష్టత వచ్చిందని, ఇప్పుడు అక్కడి నుంచి కూడా కోడళ్లను తెచ్చుకోవచ్చునని ఆయన అన్నారు. ఇప్పుడు కాశ్మీర్ తలుపులు తెరుచుకున్నాయని, అక్కడి నుంచి అమ్మాయిలను తెచ్చుకోవచ్చునని ప్రజలు అంటున్నారని ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 
 

ఈ వార్తలు కూడా చదవండి

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీరీ అమ్మాయిలపై సిఎం వివాదాస్పద వ్యాఖ్యలు