అవినీతిని నిర్మూలిస్తామని, నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని మన నేతలు ఎన్ని సార్లు ప్రకటనలు చేస్తున్నారో తెలిసిందే. అయితే అవినీతి విషయంలో ఉక్కు పాదం మోపే అధికారులను సైతం వారు ఊపేక్షించరు.

దీనికి స్వతంత్ర భారతంలో ఎన్నో ఉదాహరణలు.. అక్రమార్కుల దౌర్జన్యానికి ఎంతోమంది అధికారులు ప్రాణాలను కోల్పోగా, వేధింపులు, బదిలీలు సరేసరి. తాజాగా 27 ఏళ్ల సర్వీసులో 52వ సారి బదిలీ చేయించుకుని ఓ ఐఏఎస్ అధికారి.. ఇండియాలో తమలాంటి వారి పరిస్ధితి ఎలా ఉందో రుజువు చేశారు.

1991 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సీనియర్ అధికారి అశోక్ ఖేమ్కాను హర్యానా ప్రభుత్వం తాజాగా ట్రాన్స్‌ఫర్ చేసింది. 15 నెలలుగా హర్యానా క్రీడా, మువజన విభాగంలో పని చేస్తున్నారు.

తాజాగా ప్రభుత్వం బదిలీ చేసిన తొమ్మిది మంది ఐఏఎస్ అధికారుల లిస్ట్‌లో అశోక్ పేరు కూడా ఉంది. 2012లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు, డీఎల్ఎఫ్‌కు మధ్య కుదిరిన భూ ఒప్పందాన్ని ఆయన రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగింది.

ఆ తర్వాత హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా పాలనలో చోటు చేసుకున్న అనేక అవకతవకలను సైతం ఆయన బయటపెట్టారు. నిజాయితీ, ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనది అందెవేసిన చేయి.

విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు తీస్తామనే బెదిరింపులు సైతం అశోక్ ఎదుర్కొన్నారు. అయితే అక్రమార్కులు మాత్రం ఆయనను పలు ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్లు చేయించేవారు. అయినప్పటికీ అశోక్ వెనక్కి తగ్గలేదు.

అయితే తాజాగా ఆరావళీ పర్వత శ్రేణుల్లో భూ ఏకీకరణ గురించి మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు ఓ జాతీయ దినపత్రికలో ప్రచురితమయ్యాయి. వార్తలు వెలుగులోకి వచ్చిన కొన్ని గంటల్లోనే అశోక్‌ను బదిలీ చేశారు.

ప్రస్తుతం ఆయనను సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపాల్ సెక్రటరీగా నియమించారు. ఈ మేరకు హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీఎస్ దేశీ ఉత్తర్వులు జారీ చేశారు. తాజా బదిలీతో ఆయన 27 ఏళ్ల కెరీర్‌లో 52వసారి ట్రాన్స్‌ఫర్ జరిగినట్లయ్యింది.