హర్యానాలోని ఆరావళి బయోడైవర్సిటీ పార్క్ (Aravalli Biodiversity Park) అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది. దేశంలోనే మొట్టమొదటి ‘ఇతర ప్రభావవంతమైన ప్రాంతాల-ఆధారిత పరిరక్షణ చర్యల’ (OECM) గుర్తింపును పొందింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అధికారులు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు
హర్యానాలోని ఆరావళి బయోడైవర్సిటీ పార్క్ (Aravalli Biodiversity Park) అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది. దేశంలోనే మొట్టమొదటి ‘ఇతర ప్రభావవంతమైన ప్రాంతాల-ఆధారిత పరిరక్షణ చర్యల’ (OECM) గుర్తింపును పొందింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అధికారులు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. బుధవారం ప్రపంచ చిత్తడి నేలలు దినోత్సవం సందర్భంగా ఈ గుర్తింపును అందజేయడం జరిగింది. హర్యానా బయోడైవర్సిటీ బోర్డ్ ఛైర్మన్ వినీత్ కుమార్ గార్గ్ (Vineet Kumar Garg) మాట్లాడుత.. ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) ద్వారా OECM ట్యాగ్‌ను అంతగా రక్షితం కాకపోయినప్పటికీ.. గొప్ప జీవవైవిధ్యానికి మద్దతు ఇచ్చే ప్రాంతాలకు అందించబడుతుంది. గురుగ్రామ్‌లోని ఆరావళి బయోడైవర్సిటీ పార్క్ దేశంలోనే మొదటి OECM సైట్‌గా గుర్తించబడింది. ఇది గర్వించదగ్గ విషయం’ అని తెలిపారు.
OECM ట్యాగ్ ఎటువంటి చట్టపరమైన, ఆర్థిక, నిర్వహణ చిక్కులను తీసుకురాదని.. అయితే అంతర్జాతీయ మ్యాప్‌లో ఈ ప్రాంతాన్ని బయోడైవర్సిటీ హాట్‌స్పాట్‌గా పేర్కొంటుందని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇక, ఆరావళి బయోడైవర్సిటీ పార్క్‌ను OECM సైట్‌గా ప్రకటించాలనే ప్రతిపాదనను నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ డిసెంబర్ 2020లో IUCNకి పంపింది.
బయోడైవర్సిటీ పార్క్ అభివృద్ధికి కృషి చేసిన ఎకో-రిస్టోరేషన్ ప్రాక్టీషనర్ విజయ్ ధాస్మన మాట్లాడుతూ.. ‘ఇది పార్క్‌కు దక్కిన గౌరవం.. ఇది ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందడంలో సహాయపడుతుంది. ఇది గురుగ్రామ్ ప్రజలు, గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ (MCG), ఎన్జీవోలు (NGOలు), కార్పొరేట్‌ల సమిష్టి కృషి. నగరంలో మరిన్ని స్థలాలు ఇదే పద్ధతిలో అభివృద్ధి చెందుతాయని ఆశిస్తున్నాం. ఆరావళిలోని వృక్షజాలం, జంతుజాలాన్ని తిరిగి తీసుకురావాలనే మా ఆకాంక్సకు ఇది ఒక గుర్తింపు’ అని తెలిపారు.
ఇక, ఆరావళి బయోడైవర్సిటీ పార్క్ 390 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇక్కడ దాదాపు 300 స్థానిక మొక్కలు, 101,000 చెట్లు, 43,000 పొదలు, అనేక జాతుల పక్షులతో పాక్షిక వృక్షసంపదను కలిగి ఉంది. అయితే 40 ఏళ్ల మైనింగ్ సైట్‌గా ఉన్న ఈ ప్రాంతం.. సిటీ ఫారెస్ట్‌గా మార్చబడింది. పౌరులు, గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషషన్, పర్యావరణ శాస్త్రవేత్తల కృషితో ఇది సాకారమైంది. 2010లో IAmGurgaon పేరుతో ఏర్పాటైన సంస్థ ఆరావళిలను రక్షించాలని నినాదం ఇవ్వడంతో.. ఆ ప్రాంతంలో పచ్చదనం దిశగా అడుగులు పడ్డాయి.
గత ఏడాది ఏప్రిల్‌లో.. 2031 వరకు ఆరావళి బయోడైవర్సిటీ పార్క్‌ను పర్యావరణ పునరుద్ధరణ, పరిరక్షణ కోసం హీరో మోటోకార్ప్ లిమిటెడ్‌తో గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. గతేడాది జూలైలో అధికారికంగా దాని నిర్వహణను హీరో మోటోకార్ప్‌కు అప్పగించింది.
డ్రైవ్‌కు నాయకత్వం వహించిన IAmGurgaon సహ వ్యవస్థాపకురాలు లతికా తుక్రాల్ మాట్లాడుతూ.. ‘ఆరావళి బయోడైవర్సిటీ పార్క్ భారతదేశంలో మొదటి OECM సైట్‌గా అవతరించింది. అధికారులు కూడా జీవవైవిధ్య హాట్‌స్పాట్‌ను రక్షించాల్సిన అవసరాన్ని గుర్తించారు. గురుగ్రామ్ పౌరులకు ఇది అద్భుతమైన విజయం’ అని తెలిపారు.
