మత్స్య సంపద అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సిద్దిపేటలో పీవీ నర్సింహారావు వెటర్నరీ కళాశాల నిర్మాణానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. 

Harish Rao: మరోసారి కేంద్ర మంత్రులపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఢిల్లీలో తెలంగాణను మెచ్చుకుంటారనీ, వాళ్లే గల్లీకి వచ్చి తిడుతున్నారని విమర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో పి.వి.నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయ భవన సముదాయనికి మంత్రి హరీశ్ రావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్ రావు.. మత్స్యశాఖ అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు.

మూగజీవాలకు కూడా సీఎం కేసీఆర్ నాయకత్వంలో విస్తృత సేవలు అందుతున్నాయన్నారు. తెలంగాణ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతుందని విమర్శించారు. తెలంగాణను ఢిల్లీలో మెచ్చుకుంటారు.. గల్లీలో తిడతారా? కేంద్ర మంత్రులను ప్రశ్నించారు. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందనీ, అందుకే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అవార్డుల మీద అవార్డులు ఇస్తున్నారనీ, కానీ.. వాళ్లే గల్లీలోకి వచ్చి తిడుతున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. 

వెటర్నరీ కాలేజీని సిద్దిపేటకు ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. పీవీ ఘాట్ నిర్మాణానికి కాంగ్రెస్ అనుమతి ఇవ్వలేదని, పీవీ ఆస్పత్రికి పేరు పెట్టి గౌరవం పెంచిన ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు. అలాగే.. తెలంగాణ ఉద్యమ మార్గదర్శకులైన కాళోజీ, కొండా లక్ష్మణ్‌బాపూజీ పేర్లతో విశ్వవిద్యాలయాలు స్థాపించారని తెలియజేశారు.

కాళేశ్వరం వల్ల ఎండాకాలంలోనూ గ్రామాల్లో చెరువులు నిండుకుండలా ఉన్నాయని, జలసిరి పెరిగి అలుగుపారుతున్నాయన్నారు.ఈ ఘతన సీఎం కేసీఆర్ కే దక్కుతోందని అన్నారు. చెరువుల వల్ల ఎంతో మంది మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారనీ, సిద్దిపేట జిల్లాలో 12,460 మంది మత్స్యకారులకు కొత్త సభ్యత్వం పొందారని అన్నారు. అలాగే.. 3.70 లక్షల మందికి రెండో విడుత గొర్రెలను పంపిణీ చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.