గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి హార్దిక్ పటేల్ రాజీనామా చేశారు. గుజరాత్ కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విబేధాలతోనే హార్ధిక్ పటేల్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారని తెలుస్తోంది.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి హార్దిక్ పటేల్ రాజీనామా చేశారు. గుజరాత్ కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విబేధాలతోనే హార్ధిక్ పటేల్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారని తెలుస్తోంది. తన రాజీనామా లేఖను ట్విట్టర్‌లో పోస్టు చేసిన హార్దిక్ పటేల్.. ‘‘నేను కాంగ్రెస్ పార్టీకి, పదవికి రాజీనామా చేయడానికి ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నాను. నా నిర్ణయాన్ని నా సహచరులు, గుజరాత్ ప్రజలు స్వాగతిస్తారని నేను నమ్ముతున్నాను. కాంగ్రె‌స్‌కు రాజీనామా చేయడం ద్వారా భవిష్యత్తులో నేను గుజరాత్ కోసం నిజంగా సానుకూలంగా పని చేయగలనని నమ్ముతున్నాను’’ అని పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు. 

పాటిదార్ రిజర్వేషన్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్.. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. అయితే గత కొద్దికాలంగా కాంగ్రెస్‌లో తనకు సరైన ప్రాధాన్యం లభించడం లేదంటూ ఆయన నిరసన గళం వినిపిస్తున్నారు. గుజరాత్ కాంగ్రెస్ యూనిట్‌లో అంతర్గత పోరు గురించి అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే పార్టీలో తన పరిస్థితి వేసెక్టమీ చేయించుకున్న కొత్త పెళ్లికొడుకులా తయారైందని హార్దిక్ పటేల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. 

ఇక, కొన్ని వారాల క్రితం తాను రఘువంశానికి చెందిన వాడినని హార్దిక్ పటేల్ చెప్పారు. లవకుశుల వారసులమని అన్నారు. రాముడిని పూజిస్తామని, ఈశ్వరుడిని, దేవతలను ఆరాధిస్తామని వివరించారు. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్‌ను వీడనున్నారని ప్రచారం సాగింది. ఆయన బీజేపీ వైపు చూస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. 

Scroll to load tweet…

మరోవైపు మరో రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో హార్దిక్ పటేల్ భేటీ అవుతారని.. తనకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై చర్చిస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఈలోపే హార్దిక్ పటేల్ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక, ఈ ఏడాది చివరిలో గుజరాత్‌లో ఎన్నికలు జరగనుండగా.. హార్దిక్ పటేల్ వంటి నేత పార్టీని వీడటం కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.