పశ్చిమబెంగాల్ లో 14 ఏళ్ల బాలిక అత్యాచారం, హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై రాష్ట్రంలో విపక్షాలు బగ్గుమన్నాయి. ఈ ఘటనపై సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళన రేకిత్తించాయి. దీనిని నిరసిస్తు నేడు బీజేపీ 12 గంటల రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. 

పశ్చిమ బెంగాల్‌లోని నదియాలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్యపై తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీశాయి. ఈ ఆగ్రహావేశాల మధ్య బీజేపీ రాష్ట్ర విభాగం ఈ రోజు 12 గంటల పాటు బంద్‌కు పిలుపునిచ్చింది. హ‌త్యాచారం, హ‌త్య ఘ‌ట‌న‌ల‌కు నిరసనగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమ్మె కొనసాగనుంది. బాలికపై అసలు అత్యాచారం జరిగిందా లేదా ప్రేమ వ్యవహారం వల్ల గర్భం దాల్చిందా అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నించడంతో సోమవారం పరిస్థితి మరింత తీవ్రమైంది.

‘‘ ఆమెపై అత్యాచారం జరిగిందో లేదో మీకు ఎలా తెలుసు? పోలీసులు మరణానికి గల కారణాలను ఇంకా నిర్ధారించలేదు. నేను వారిని అడిగాను. ఆమె గర్భవతిగా ఉందా లేదా ప్రేమ వ్యవహారం ఉందా లేదా అనారోగ్యంతో ఉందా? అది ప్రేమ వ్యవహారమని కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. ఒకవేళ ఒక జంట ప్రేమ‌లో ఉంటే వారిని నేను వారిని ఎలా ఆపగలను? ” అని బిస్వా బంగ్లా మేళా ప్రాంగన్ ప్రారంభోత్సవం వేడుక‌ల సంద‌ర్భంగా సీఎం ప్రసంగించారు. దీనిపై రాష్ట్ర బాలల కమిషన్‌ విచారణ జరుపుతుందని కూడా సీఎం చెప్పారు.

ఈ వ్యాఖ్యలు ప్రతిపక్ష శిబిరంలో ఆగ్రహాన్ని రేకెత్తించాయి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి అధికార పార్టీకి ఉన్న సంబంధాన్ని బీజేపీ నేతలు ఎత్తిచూపారు. ‘‘టీఎంసీ బ్లాక్ ప్రెసిడెంట్ కుమారుడు మైనర్ బాలికపై అత్యాచారం చేసి, సాక్ష్యాలను నిర్మూలించడానికి ఆమె శరీరాన్ని తగులబెట్టాడు. ఇదిలా ఉంటే, ఇది అత్యాచారమా, బాలిక గర్భం దాల్చిందా , లేదా ప్రేమ వ్యవహారమా ? అని ముఖ్యమంత్రి అడిగారు. ఇది చాలా అవమానం! ’’ అని పశ్చిమ బెంగాల్ బీజేపీ ట్వీట్ చేసింది.

రాష్ట్రంలో ఆర్టికల్ 355ని విధించాలని కోరుతూ సోమవారం ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌ఖర్‌ను కలిశారు. అయితే రాష్ట్రంలో ఈ ఆర్టిక‌ల్ అమ‌లు చేస్తే రాష్ట్రంలో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి నిబంధ‌లు అమ‌ల్లోకి వ‌స్తాయి. దీంతో కేంద్రం కూడా జోక్యం చేసుకోవచ్చు. 

‘‘ ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్‌ను కలిశాను. నదియాలో 14 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్యపై విచారణ కోరాను. నేను మంగళవారం మరణించిన వారి కుటుంబాన్ని కలుస్తాను ’’ అని సువేందు అధికారి తెలిపారు. 

ప‌శ్చిమ బెంగాల్ లో తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసిన ఈ ఘ‌ట‌న గత వారం హన్స్‌ఖాలీలో జరిగింది. తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న బాలిక‌పై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు, హ‌త్యా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ ఘ‌ట‌న‌కు తృణమూల్ కాంగ్రెస్ పంచాయతీ నాయకుడి కుమారుడే కార‌ణ‌మ‌ని బాధిత కుటుంబం ఆరోపించింది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు IPC సెక్షన్లు 376(2)(G) (గ్యాంగ్ రేప్), 302 (హత్య), 204 (సాక్ష్యాలను తారుమారు చేయడం), POCSO చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.