అంబాల: రెండున్నర ఏళ్ల తర్వాత ఓ మహిళ తన నేరాన్ని అంగీరించింది. పోలీసాఫీసర్ అయిన తన భర్తను తానే చంపానని చెబుతూ తనను ఉరి తీయాలని కోరుతూ అంబాలకు చెందిన మహిళ హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ కు ఓ లేఖను ఇచ్చింది. 

పోస్టుమార్టం నివేదికలో ఏ అనుమానాలు కూడా తలెత్తలేదని, అయితే మహిళ తాజా లేఖతో కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. తన భర్త అయిన అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ రోహ్ తాస్ సింగ్ ను తానే చంపానని సునీల్ కుమారి మంత్రి ఇచ్చిన లేఖలో తెలిపింది. 

ప్రజా సమస్యలను తీసుకుంటున్న సందర్భంలో సోమవారంనాడు సునీల్ కుమారి హోం మంత్రికి ఆ లేఖ ఇచ్చినట్లు అంబాల పోలీసు సూపరింటిండెంట్ (ఎస్పీ) అభిషేక్ జోర్వాల్ చెప్పారు. తాను తన భర్తను ఎలా చంపిందీ లేఖలో ఆమె వివరించింది. 

లేఖలోని వివరాల ప్రకారం.... 2017 జులై 15వ తేదీన చిత్తుగా తాగి ఏఎస్ఐ ఇంటికి వచ్చి రావడంతోనే భార్యను తిట్టడం ప్రారంభించాడు. అలా తిడుతూనే అతను పడిపోయాడు. పడిపోయి కక్కే సమయంలో భార్య ఓ గుడ్డతో ఆపింది. దాంతో ఆహార పదార్థాలు గొంతులో ఇరుక్కుపోయి అతని మరణించాడు. 

వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అతను మరణించినట్లు వైద్యులు తేల్చారు. గత రెండున్నర ఏళ్లుగా ఆ విషయాన్ని తాను కడుపులోనే దాచుకున్నానని, తాను నేరభావనతో కుమిలిపోతున్నానని ఆ మహిళ లేఖలో రాసింది. మహిళను పోలీసులు అరెస్టు చేసి మహిళా పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.