చికబళ్లాపూర్: తనకు పెళ్లి కావడంలేదని అభం శుభం తెలియని ఓ చిన్నారికి బలితీసుకున్నాడో కసాయి. దివ్యాంగురాలన్న జాలి, దయ కాదు తన అన్న కూతురన్న ప్రేమ లేకుండా చిన్నారిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు దుర్మార్గుడు. ఈ దారుణం కర్ణాటకలో చోటుచేసుకుంది.

చికబళ్లాపురం సమీపంలోని అంగరేకనహళ్ళి గ్రామానికి చెందిన కృష్ణమూర్తి, శంకర్‌లు అన్నదమ్ములు. అన్న కృష్ణమూర్తికి దివ్యాంగురాలయిన కూతురు చర్విత వుంది. అయితే శంకర్ కు పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు సంబంధాలు చూస్తున్నారు. కానీ ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి మాత్రం కుదరడం లేదు. దీంతో అతడు తీవ్ర అసహనంతో సైకోలా మారాడు. 

 అన్న కూతురు దివ్యాంగురాలన్న కారణంతోనే తనకు పెళ్లి సంబంధాలు కుదరడం లేదని భావించి దారుణానికి పాల్పడ్డాడు. దివ్యాంగురాలయిన చర్విత ఇంటి ఎదుట ఆడుకుంటుండగా అతి కిరాతకంగా గొంతు కోశాడు. బాలిక తల్లి ఎదుటే ఈ దారుణానికి పాల్పడ్డాడు. తీవ్న రక్తస్రావం అవడంతో బాలిక అక్కడికక్కడే మరణించింది.

ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు  నమోదు చేసుకుని నిందితుడు శంకర్ కోసం గాలింపు చేపట్టారు.