Asianet News TeluguAsianet News Telugu

వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ‘హలాల్’ రగడ.. శ్రావణ మాసంలో ఎందుకు ఇస్తున్నారంటూ ప్యాసింజర్ ఫైర్.. వీడియో వైరల్

వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో హలాల్ సర్టిఫైడ్ టీ సాచెట్ ఇవ్వడం పట్ల ప్యాసింజర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు హలాల్ మార్క్ ఉన్న ఫుడ్ సాచెట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైలర్ గా మారింది. 

Halal ragada in Vande Bharat Express.. Why is it being given in the month of Shravan, passenger fire.. Video viral..ISR
Author
First Published Jul 23, 2023, 12:48 PM IST

ఓ రైలులో హలాల్ సర్టిఫైడ్ టీ వడ్డించే విషయంలో ఓ ప్రయాణికుడు, భారతీయ రైల్వే సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. ‘‘టైమ్స్ నౌ’’ కథనం ప్రకారం.. టీ వెజిటేరియన్ అని సిబ్బంది వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయినా ప్రయాణికుడు వినిపించుకోకుండా ‘మరి దీనిపై హలాల్’ అనే పదం ఎందుకు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఈ ఘటన ఏ రూట్ లో జరిగిందో స్పష్టంగా తెలియడం లేదు. కాగా ఈ వీడియోలో ‘హలాల్ సర్టిఫైడ్ టీ అంటే ఏమిటి, శ్రావణ మాసంలో ఇది ఎందుకు వడ్డిస్తున్నారని ప్రయాణికుడు రైల్వే సిబ్బందిని ప్రశ్నించాడు. ‘‘శ్రావణ మాసం కొనసాగుతోంది. మీరు మాకు హలాల్ సర్టిఫైడ్ టీ ఇస్తున్నారా?' అని ప్రయాణికుడు రైల్వే అధికారిని అడిగాడు. దీంతో ఆ సాచెట్ ను ఆయన పరిశీలిస్తుండగానే ‘‘హలాల్ సర్టిఫికేట్ అంటే ఏమిటో మీరు వివరించండి. అది మేము తెలుసుకోవాలి. మాకు ఐఎస్ఐ సర్టిఫికేట్ తెలుసు, హలాల్ సర్టిఫికేట్ అంటే ఏమిటో వివరించండి’’ అని ప్రయాణికుడు దబాయిస్తున్నాడు.

కొంత సమయం తరువాత రైల్వే అధికారి సాచెట్ ను ప్రయాణికుడికి సూచిస్తూ ‘‘ఇది మసాలా టీ ప్రీమిక్స్. దీనిని నేను మీకు వివరిస్తాను. ఇది 100 శాతం శాకాహారమే' అని రైల్వే సిబ్బంది తెలిపారు. మళ్లీ ప్రయాణికుడు మాట్లాడుతూ.. ‘‘మరి అయితే ఈ హలాల్ సర్టిఫికేట్ ఏమిటి? నేను తరువాత పూజ చేయాల్సి ఉంది’’ అని అన్నాడు. ఈ సమయంలో ప్రయాణికుడు తన సెల్ ఫోన్ ద్వారా వీడియో తీయడాన్ని గమనిస్తూ.. ‘‘మీరు వీడియో తీస్తున్నారా? ఇది 100 శాతం వెజిటేరియన్. చాయ్ వెజ్ హి హోతా హై సార్ (టీ శాఖహారమే ఉంటుంది సార్)’’ అని సమాధానం ఇచ్చారు. 

మళ్లీ దానికి ప్రయాణికుడు స్పందిస్తూ.. ‘‘నాకు మతపరమైన సర్టిఫికేషన్ అక్కర్లేదు. దయచేసి ఈ భావాలను గుర్తుంచుకోండి. అప్పుడు స్వస్తిక్ సర్టిఫికేట్ పెట్టండి’’ చెప్పాడు. ‘‘సరే, ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటాను’’ రైల్వే అధికారి చెబుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

కాగా.. ఈ వీడియో వైరల్ కావడంతో ఐఆర్సీటీసీ స్పందించింది. ‘‘ ఆ వీడియోలో చూపించిన బ్రాండ్ ప్రీమిక్స్ టీకి ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేషన్ ఉంది. గ్రీన్ డాట్ సూచన ఉంటే వంద శాతం శాఖాహారం అని అర్థం. అయితే ఈ ప్రీమిక్స్ టీ ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతుంది. అందుకే వీటి ఉత్పత్తిదారుడు ఎగుమతి నిబంధనలకు అనుగుణంగా వాటిపై ‘హలాల్ సర్టిఫికేషన్’ తప్పనిసరిగా ఉంటుంది.’’ అని ట్వీట్ చేసింది. రైళ్లలో అందించే టీ స్వచ్ఛమైదని, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినదని ప్రయాణికులకు భరోసా ఇస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. 

ఇదిలా ఉండగా.. టీ ప్రీమిక్స్ కంపెనీ చైజుప్ కూడా దీనిపై స్పందిస్తూ.. తమ ఉత్పత్తిని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నందుకే హలాల్ సర్టిఫికేషన్ ఇచ్చినట్టు స్పష్టం చేసింది. ‘‘మా ఉత్పత్తుల అన్ని ల్యాబ్ రిపోర్టులు అందుబాటులో ఉన్నాయి. మా ఉత్పత్తులు 100 శాతం శాఖాహారం. అన్ని పదార్థాలు సహజమైనవి. మా టీ, కాఫీ ప్రీమిక్స్ తయారీకి పాల పొడి, 100 శాతం మొక్కల ఆధారిత పదార్థాలను ఉపయోగిస్తాం’’ అని చైజుప్ సీఈఓ గుంజన్ పొద్దార్ ఒక ప్రకటనలో తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios