శబరిమల ఆలయంలోని ఇద్దరు మహిళలు ప్రవేశించి.. అయ్యప్ప స్వామిని దర్శించుకోవడాన్ని నిరసిస్తూ.. ఓ వ్యక్తి వినూత్న నిరసన చేపట్టాడు. రాజేశ్ కురూప్ అనే వ్యక్తి.. సగం మీసం కత్తిరించుకొని.. నిరసన తెలిపాడు. 

పూర్తి వివరాల్లోకి వెళితే..అనేక అవాంతరాల మధ్య ఇద్దరు మహిళలు బుధవారం శబరిమల ప్రధాన ఆలయంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. దీనిపై అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేరళ వ్యాప్తంగా బంద్‌కు కూడా పిలుపునిచ్చాయి. 

ఈ నేపథ్యంలో రాజేశ్ తనదైన శైలిలో సగం మీసం కత్తిరించుకుని నిరసన తెలిపారు. తన ఫేస్ బుక్ పేజీలో ఫోటోలను అప్ లోడ్ చేసిన ఆయన.. మహిళల ప్రవేశాన్ని ఖండించారు. హిందువులు మేల్కోవాలని.. తమ ఆస్తులను కాపాడుకోవాలంటూ పిలుపునిచ్చారు.
 
మన్నార్ ప్రాంతానికి చెందిన రాజేశ్..  గతంలో శబరిమల ఫొటో షూట్‌తో అందరి దృష్టిలో పడిన విషయం తెలిసిందే. అయ్యప్ప స్వామి మాలధారణలో ఉన్న రాజేశ్‌ను ఓ పోలీస్ కానిస్టేబుల్ కాలితో తన్నుతున్నట్టు ఉండేలా ఫొటో దిగి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటో తక్కువ వ్యవధిలో వైరల్‌గా మారింది. దీనిపై స్థానిక డీవైఎఫ్ఐ పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రాజేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.