నా ఫోన్ ను ఎంతైనా హ్యాక్ చేసుకోండి.. ఇలాంటి ప్రయత్నాలకు బయపడబోం - రాహుల్ గాంధీ..
తన ఫోన్ ను ఎంతైనా హ్యాక్ చేసుకోవాలని, ఇలాంటి చర్యలకు ప్రతిపక్ష నాయకులు బయపడబోరని కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. కావాలంటే తన ఫోన్ ను కూడా ఇచ్చేస్తానని చెప్పారు. తమ ఫోన్లు హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు ప్రతిపక్ష నాయకులు వెల్లడించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఐఫోన్ 'హ్యాక్' వివాదంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తన ఫోన్ ను కావాలంటే ఎంతైనా హ్యాక్ చేసుకోవాలని సూచించారు. ఇలాంటి ప్రయత్నాలకు ప్రతిపక్షాలు భయపడబోవని తెలిపారు. తమ ఫోన్లకు ఆపిల్ నుంచి థ్రెట్ నోటిఫికేషన్ వచ్చిందని పలువురు ప్రతిపక్ష నాయకులు వెల్లడించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘దీనికి (హ్యాకింగ్) వ్యతిరేకంగా పోరాడుతున్నవారు చాలా తక్కువ మంది ఉన్నారు. మీరు కోరుకున్నంత (ఫోన్) ట్యాపింగ్ చేయవచ్చు, నేను పట్టించుకోను. మీరు నా ఫోన్ తీసుకోవాలనుకుంటే, మీకు ఇచ్చేస్తాను. మేం భయపడం, పోరాడేది మేమే’’ అని రాహుల్ గాంధీ మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రభుత్వం పక్కదారి పట్టించే రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లు తమ ఐఫోన్లను రిమోట్గా హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా, కాంగ్రెస్ కు చెందిన శశి థరూర్, పవన్ ఖేరా థ్రెట్ అలెర్ట్ నోటిఫికేషన్ లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను తమ ఎక్స్ హ్యాండిల్స్ లో పోస్ట్ చేశారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి కూడా ఇలాంటి సందేశమే వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కాగా.. ఈ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. అల్గారిథమ్ లోపం కారణంగా ఈ హెచ్చరిక మెయిల్స్, నోటిఫికేషన్స్ వచ్చి ఉంటాయని తెలిపాయి. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని వారు తెలిపారు. ఈ హ్యాకింగ్ వెనక బీజేపీ ఉందనే ఆరోపణను ఆ పార్టీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ఖండించారు. ఈ విషయంలో ఆపిల్ విరవణ ఇచ్చేంత వరకు వేచి ఉండాలని సూచించారు.