నాగపూర్: ఓ పాతికేళ్ల యువకుడు తన తండ్రిని అత్యంత అమానుషంగా, దారుణంగా హత్య చేశాడు. గొంతు కొరికి, మర్మాంగాలను కోసేసి తండ్రిని హత్య చేసినట్లు నాగపూర్ పోలీసులు ఆదివారంనాడు చెప్పారు. ఈ సంఘటన నగాపూర్ లోని హుద్కేశ్వర్ ప్రాంతంలో శనివారం రాత్రి జరిగింది. 

తండ్రిని హత్య చేసిన యువకుడిని విక్రాంత్ పిల్లేవార్ గా గుర్తించారు. అతను అత్యంత హింసాత్మకంగా ప్రవర్తించాడు. దాంతో అతన్ని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. 

కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.... ఏ విధమైన ప్రేరేపణ లేకుండా విక్రాంత్ తన తండ్రి గొంతు కొరికాడు. దాంతో తండ్రి గొంతు నుంచి రక్తం కూడా కారింది. ఆ తర్వాత తండ్రిని వరండాలోకి లాక్కెళ్లి అతని మర్మాంగాలను కోసేశాడు. 55 ఏళ్ల వయస్సు గల తండ్రి విజయ్ ను విక్రాంత్ అక్కడికక్కడే హత్య చేశాడు.

జిమ్ ట్రైనర్ అయిన విక్రాంత్ హిందీ సినిమా డైలాగులు ఉచ్చరిస్తూ హింసాత్మకంగా ప్రవర్తించాడని కుటుంబ సభ్యులు చెప్పారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన తల్లిని, సోదరిని కూడా అతను బెదిరించాడు. ఐదుగురు పోలీసులు అతి కష్టంగా అతన్ని పట్టుకుని, కట్టి పడేశారు.