Asianet News TeluguAsianet News Telugu

జ్ఞానవాపి మసీదు గోడలపై 3 తెలుగు శాసనాలు .. ఆ హిందూ ఆలయానికి సంబంధించినవేనా..?

వివాదాస్పద జ్ఞానవాపి మసీదుకు సంబంధించి ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఏ) ఇటీవల సమర్పించిన నివేదిక పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా మైసూరులోని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎపిగ్రఫీ విభాగం వారణాసిలోని జ్ఞానవాపి మసీదు గోడలపై మూడు తెలుగు శాసనాలను కనుగొంది. 
 

gyanvapi mosque case : 3 Telugu inscriptions on Gyanvapi mosque walls shed light on mandir ksp
Author
First Published Jan 30, 2024, 2:58 PM IST | Last Updated Jan 30, 2024, 3:00 PM IST

వివాదాస్పద జ్ఞానవాపి మసీదుకు సంబంధించి ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఏ) ఇటీవల సమర్పించిన నివేదిక పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. జ్ఞానవాపి మసీదు ఓ పురాతన ఆలయంపైనే జరిగిందంటూ కొన్ని విగ్రహ శిథిలాలు, ఇతర శాసనాలను ఏఎస్ఐ ప్రస్తావించింది. తాజాగా మైసూరులోని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎపిగ్రఫీ విభాగం వారణాసిలోని జ్ఞానవాపి మసీదు గోడలపై మూడు తెలుగు శాసనాలను కనుగొంది. 

ఏఎస్ఐ డైరెక్టర్ (ఎపిగ్రఫీ) కె. మునిరత్నం రెడ్డి నేతృత్వంలోని నిపుణుల బృందం తెలుగులో వున్న మూడు శాసనాలతో సహా 34 శాసనాలను విడదీసి.. కాశీ విశ్వనాథ దేవాలయం ఉనికిపై  నివేదికను సమర్పించింది. 17వ శతాబ్ధానికి చెందిన ఒక శాసనంలో నారాయణ భట్ట కుమారుడు మల్లన్న భట్లు వంటి వ్యక్తుల పేర్లను స్పష్టంగా పేర్కొన్నట్లు మునిరత్నం జాతీయ వార్తాసంస్థ ది టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపారు. 

నారాయణ భట్లు 1585లో కాశీ విశ్వనాథ ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించిన తెలుగు బ్రహ్మాణుడన్న సంగతి తెలిసిందే. 15వ శతాబ్ధంలో కాశీ విశ్వనాథ ఆలయాన్ని కూల్చివేయాలని జౌన్‌పూర్‌కు చెందిన హుస్సేన్ షర్కీ సుల్తాన్ (1458-1505) ఆదేశించాడని చెబుతారు. ఈ ఆలయం 1585లో పునర్నిర్మించబడింది. రాజా తోడరమల్ ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించాల్సిందిగా దక్షిణ భారతదేశానికి చెందిన నిపుణుడైన నారాయణ భట్లుడిని కోరినట్లుగా చెబుతారు. ప్రస్తుతం వెలుగుచూసిన శాసనం.. పైన చెప్పిన వాస్తవాన్ని బలపరుస్తుందని మునిరత్నం వివరించారు. 

ఈ శాసనం జ్ఞానవాపి మసీదు గోడపై చెక్కబడి తెలుగు భాషలో వ్రాయబడింది. అది పూర్తిగా పాడైపోయి అసంపూర్తిగా వున్నప్పటికీ అందులో మల్లన భట్లు, నారాయణ భట్లు అనే పేర్లు మాత్రం స్పష్టంగా వున్నాయని ఏఎస్ఐ డైరెక్టర్ వెల్లడించారు. మసీదు లోపల దొరికిన రెండవ తెలుగు శాసనం ఒక ‘గోవి’ (పశువులు, గొర్రెల కాపర్ల వద్ద వుండే వస్తువు) గురించి ప్రస్తావించింది. మూడవ శాసనం.. 15వ శతాబ్ధానికి చెందినది, మసీదుకు ఉత్తరం వైపున వున్న ప్రధాన ద్వారం వద్ద ఏఎస్ఐ నిపుణులు దానిని కనుగొన్నారు. ఇందులో 14 లైన్లు వుండగా, అవి పూర్తిగా పాడైపోయాయని నిపుణులు చెబుతున్నారు. 

తెలుగుతో పాటు కన్నడ, దేవనాగరి, తమిళ భాషల్లో శాసనాలు వుండేవి. ఏఎస్ఐ ఎపిగ్రఫీ విభాగం గతంలో అయోధ్యలో సంస్కృత శాసనాన్ని కనుగొన్నాయి. ఈ శిలాశాసనం ఒక స్లాబ్‌పై చెక్కబడి వుంది. అయోధ్యలో స్థలాన్ని చదును చేస్తుండగా ఇది కనుగొనబడింది. సంస్కృత భాషలో 12వ, 13వ శతాబ్ధానికి చెందిన నాగరి అక్షరాలలో దీనిని రాశారు. నాపాల కామ అనే వ్యక్తి రాముడికి నమస్కరించినట్లుగా ఇందులో రికార్డు చేసినట్లు మునిరత్నం చెప్పారు. 

కాగా.. జ్ఞానవాపి వివాదం నేపథ్యంలో హిందూ పక్షం వాదిస్తున్న దాని ప్రకారం.. జ్ఞానవాపి మసీదు సముదాయం వున్న ప్రదేశంలో ఒకప్పుడు పెద్ద హిందూ దేవాలయం వుండేదని ఏఎస్ఐ సర్వే నివేదిక వెల్లడించింది. మసీదు పశ్చిమ గోడ హిందూ దేవాలయంలో భాగమని, ఈ ప్రదేశంలో 32 హిందూ దేవాలయ శాసనాలు దొరికాయని నివేదిక పేర్కొంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios