జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు శుక్రవారం నాడు కీలక తీర్పును ఇచ్చింది. హిందూ సంఘాల పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది
లక్నో: జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు శుక్రవారం నాడు కీలక తీర్పును ఇచ్చింది. హిందూ సంఘాల పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. శివలింగానికి కార్బన్ డేటింగ్ చేసేందుకు కోర్టు నిరాకరించింది. మసీదు లోపల సీజ్ చేసిన ప్రాంతంలో కార్బన్ డేటింగ్ వంటి ఏ రకమైన సర్వే చేసినా కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్టేనని కోర్టు అభిప్రాయపడింది.
మసీదును నిర్వహించే అంజుమన్ ఇంతేజామియా కమిటీ అభ్యంతరాలను విన్న తర్వాత జిల్లా జడ్జి ఎకె విశ్వేషా హిందూసంఘాల పిటిషన్ ను తిరస్కరించారు. శివలింగానికి కార్బన్ డేటింగ్ ప్రక్రియ నిర్వహిస్తే అది పాడైపోతే అది సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టేనని మసీదు కమిటీ తరపు న్యాయవాది ముంతాజ్ అహ్మద్ కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఈ శివలింగాన్ని సురక్షితంగా ఉంచాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించిన విషయాన్ని ముంతాజ్ గుర్తుచేశారు ఇరు వర్గాల వాదనలను విన్న తర్వాత హిందూ సంఘాల పిటిషన్ వారణాసి జిల్లా కోర్టు జడ్జి విశ్వేషా తిరస్కరించారు.
గత మాసంలో ఐదుగురు హిందూ పిటిషనర్లు మసీదులో శివలింగంపై శాస్త్రీయ దర్యాప్తు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. మసీదు లోపల ఉన్నట్టుగా చెబుతున్న శివలింగం వయస్సును నిర్ణయించడం అవసరమని పిటిషనర్లు వాదించారు. మసీదు లోపల పురాతన హిందూ దేవతల విగ్రహలు కూడా ఉన్నాయని ఆ పిటిసన్ లో పేర్కొన్నారు.
అయితే మసీదులో శివలింగం విషయమై శాస్త్రీయ దర్యాప్తును మసీదు కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. మసీదులో ఉన్న పౌంటెన్ ను శివలింగంగా భావిస్తున్నారని మసీదు కమిటీ వాదించింది.ఇదిలా ఉంటే మసీదు సముదాయంలో ప్రార్ధనలకు అవకాశం కల్పించాలని హిందూ సంఘాల తరపున పిటిషనర్లు కోరారు. మసీదులో నీటితో ఉన్న ప్రాంతంలో శివలింగం ఉన్నట్టుగా పిటిషనర్లు వాదిస్తున్నారు. ఈ విషయమైశాస్త్రీయ విచారణ కోసం కమిషన్ ను ఆదేశించే అధికారం కోర్టుకు ఉందని చెప్పే నిబంధనను కూడా పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.
మసీదు సముదాయంలో ఏడాది పొడవునా పూజలుచేయడానికి అనుమతి కోరుతూ హిందూ మహిళలు దాఖలు చేసిన పిటిషన్ ను సవాల్ చేస్తూ మసీదుకమిటీ దాఖలు చేసిన పిటిషన్ ను వారణాసి జిల్లా కోర్టు ఈ ఏడాది సెప్టెంబర్ 12న కొట్టివేసింది.
also read:జ్ఞానవాపి కేసుపై కోర్టు కీలక నిర్ణయం.. హిందూ మహిళల పిటిషన్ విచారణకు అంగీకారం
జ్ఞానవాపి మసీదులో శతాబ్దాల నాటి ప్రార్ధనలకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్ పై ఈ మసీదును వీడియోగ్రఫీ చేసి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.ఈ నివేదికలోని అంశాలు ముందే మీడియాకు లీక్ అయింది.ఈ విషయమై కోర్టు ఆగ్రహం చేసింది. ఈ సమయంలోనే మసీదులోని కొలనులో శివలింగం ఉన్నట్టుగా గుర్తించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి నియోకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి మసీదులను నిర్మించారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
