Gyanvapi Case: జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగాన్ని పూజించడానికి అనుమతించాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు నిరాకరించింది. అంజుమన్ మసీదు నిర్వహణ కమిటీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారించింది.
Gyanvapi Case: జ్ఞాన్‌వాపి మసీదులో విషయంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మసీదులో లభించిన 'శివలింగానికి పూజలు, కార్బన్ డేటింగ్‌కు అనుమతి ఇవ్వాలంటూ దాఖలైన తాజా పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో కింది కోర్టులో విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. ఇప్పటికే ఈ వివాదంపై పలు పిటిషన్లు పెండింగ్ లో ఉన్న కారణంగా.. కొత్తగా దావాను తీసుకోలేమని కోర్టు తెలిపింది. అలాగే.. కార్బన్ డేటింగ్ చేయడంతో పాటు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సర్వే కూడా చేయడానికి అనుమతించలేదు.
పిటిషన్‌లో ఏమి డిమాండ్ చేశారు?
ఒక న్యాయవాది, ఒక ప్రొఫెసర్, ఐదుగురు సామాజిక కార్యకర్తలు సహా ఏడుగురు మహిళా పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ ప్రకారం.. కార్బన్ డేటింగ్ చేయాలని, ఇది అత్యంత సురక్షితమైన, ఖచ్చితమైన, శాస్త్రీయ పద్ధతి అని, దీనిలో దేనినీ ట్యాంపరింగ్ చేయకుండా వాస్తవాలను సేకరించవచ్చని పేర్కొన్నారు.
సనాతన ధర్మంలోని మనోభావాలను దృష్టిలో ఉంచుకుని జ్ఞాన్వాపిని కాంప్లెక్స్ లోని శివలింగాన్ని పూజించేందుకు కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్టుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే కాశీలోని విశ్వనాథ దేవాలయం చుట్టూ ఐదు కోసుల విస్తీర్ణం అంటే దాదాపు 15 కిలోమీటర్లు కాశీ పీఠాధిపతి విశ్వేశ్వరుని ప్రాంతమనీ, జ్ఞానవాపి వీడియో సర్వేలో లభించిన శివలింగాన్ని కాశీ విశ్వనాథ్ ట్రస్టు స్వాధీనం చేసుకునేలా ఆదేశించాలని పిటిషన్‌లో డిమాండ్ చేశారు.
అలాగే.. అంజుమన్ ఇంతేజామియా మసీదు నిర్వహణ కమిటీ దాఖలు చేసిన పిటిషన్ ను అక్టోబర్ మొదటివారానికి వాయిదా వేస్తూ సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు ఈ పిటిషన్ ను మే 18న విచారించింది. ఈ మొత్తం కేసును సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ కోర్టు నుండి జిల్లా జడ్జి కోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ క్రమంలో, హిందువుల పిటిషన్ విచారణకు అనర్హులుగా ప్రకటించబడిన మసీదు కమిటీ దరఖాస్తును జిల్లా జడ్జి ముందుగా విచారించాలని కోర్టు పేర్కొంది.
అంజుమన్ పిటిషన్ తోపాటు నేడు సుప్రీంకోర్టులో మరో 3 పిటిషన్లు విచారించింది. వీటిలో హిందూ భక్తులు దాఖాలు చేశారు. న్యాయమూర్తులు డివై చంద్రచూడ్, సూర్యకాంత్, పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం మొదట మసీదు తరఫు న్యాయవాది హుజైఫా అహ్మదీని విచారించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు వారణాసి జిల్లా జడ్జి కోర్టులో చర్యలు కొనసాగుతున్నాయని అహ్మదీ తెలిపారు.
ఈ కేసులో కోర్టు కమిషనర్ నియామకాన్ని కూడా తాను సవాలు చేశానని హుజైఫా అహ్మదీ తెలిపారు. కమీషనర్‌ను నియమించి మసీదు స్థలాల సర్వే చేసిన తీరు తప్పుగా ఉందనీ, ఈ విషయంలో తన నిరసనను సివిల్ జడ్జి లేదా హైకోర్టు వినలేదని అహ్మదీ అన్నారు. దీనిపై, వారణాసి జిల్లా న్యాయమూర్తిని కూడా ఈ అంశాన్ని కూడా వినాలని కోరవచ్చని ధర్మాసనం ప్రతిపాదించింది. అయితే హైకోర్టు దానిని విచారించి కొట్టివేసినందున సుప్రీంకోర్టు దానిని వినాలని అహ్మదీ పట్టుబట్టారు. దీనిపై త్రిసభ్య ధర్మాసనం ఎలాంటి వ్యాఖ్యానించలేదు. వారణాసి కోర్టులో విచారణ కొనసాగుతోందని న్యాయమూర్తులు తెలిపారు. అటువంటి పరిస్థితిలో..ఈ విషయంలో ఏ అంశంపై విచారించడం సరికాదనీ, అందుకే విచారణను అక్టోబర్ మొదటి వారానికి వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.
గతంలో అలహాబాద్ హైకోర్టు జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రఫీ సర్వేకు అనుమతించిందిన విషయం తెలిసిందే.. ఆ సమయంలోనే మసీదులో శివలింగం వంటి ఆకారం బయటపడింది. అదే సమయంలో మసీదులో గోడలపై పలు రకాల హిందు మత చిహ్నాలు దర్శమించాయి. అయితే ఈ వీడియోగ్రఫీ సర్వేను ఛాలెంజ్ చేస్తూ.. అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తొలుత ఈ వివాదంపై మే 17న సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శివలింగం లాంటి ఆకారం కనుగొనబడిన ప్రాంతంతో పాటు నమాజ్ కోసం ముస్లింలకు ప్రవేశాన్ని కల్పించాలని ఆదేశించింది. ఈ క్రమంలో మే 20న ఈ కేసును వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేసింది.
