జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ లో  ఎఎస్ఐ సర్వే  ఇవాళ ప్రారంభమైంది. ఈ సర్వేకు  అలహాబాద్ హైకోర్టు నిన్న అనుమతిని ఇచ్చింది.  దీంతో ఇవాళ ఎఎస్ఐ సర్వే ప్రారంభించారు అధికారులు

న్యూఢిల్లీ: జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ లో శుక్రవారంనాడు ఉదయం ఎఎస్ఐ సర్వే ప్రారంభమైంది. ఈ సర్వే నేపథ్యంలో మసీదు వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు అంజుమన్ ఇంతేజామియా మసీదు (ఏఐఎం) కమిటీ సభ్యులు సర్వేను బహిష్కరించారు. ఏఎస్ఐ బృందంతో వెళ్లాల్సిన ఏఐఎం కమిటీ ప్రతినిధులు సర్వేకు దూరంగా ఉన్నారు.

జ్ఞానవాపి మసీదులో ఎఎస్ఐ సర్వేకు ఈ నెల 3వతేదీన అలహాబాద్ హైకోర్టు అనుమతిని ఇచ్చింది. వివాదాస్పద స్థలంలో సర్వే చేయాలన్న వారణాసి జిల్లా కోర్టు తీర్పు న్యాయమైందని హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ పేర్కొంది. సర్వే వల్ల నిర్మాణానికి ఎలాంటి నష్టం జరగదని ఎఎస్ఐ హైకోర్టుకు తెలిపింది. మరోవైపు మసీదు ఆవరణలో ఎలాంటి తవ్వకాలు చేయరాదని ధర్మాసనం పేర్కొంది.

జ్ఞానవాపి మసీదును నిర్వహించిే అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదు ఆలయంపై నిర్మించారా లేదా అనే విషయాన్ని ఎఎస్ఐ నిర్ధారించనుంది. ఇందుకు కోసం శాస్త్రీయ సర్వే నిర్వహించాలని జిల్లా కోర్టు ఈ ఏడాది జూలై 21న ఎఎస్ఐను ఆదేశించింది. ఈ ఆదేశాలను మసీదు కమిటీ ఈ ఏడాది జూలై 24న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఎఎస్ఐ సర్వేపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే సర్వేను ఎత్తివేసింది. అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషనర్లకు అనుమతిని ఇచ్చింది. 

దీంతో ఈ ఏడాది జూలై 26, 27 తేదీల్లో విచారణ నిర్వహించిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నిన్న తీర్పును వెల్లడించింది.ఇదిలా ఉంటే అలహాబాద్ హైకోర్టు ఎఎస్ఐ సర్వేకు అనుమతిని ఇవ్వడంతో మసీదు కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేసింది. ఈ అంశంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరింది. మజీదు కమిటీ పిటిషన్ దాఖలు చేయడంతో హిందూవులు కూడ సుప్రీంకోర్టులో కేవీయట్ పిటిషన్ దాఖలు చేశారు.