భర్త వేరే మహిళతో  వివాహేతన సంబంధం పెట్టుకోవడంతో ఓ భార్య అతన్ని అత్యంత కిరాకంగా హతమార్చింది. కిరాయి హంతకుల చేత భర్తను అంతమొందించి అతడి ఆస్తిని సొంతం చేసుకోవాలని చూసింది. చివరకు హత్యోదంతం బయటపడి పోలీసులకు చిక్కి కటకటాలపాలవ్వాల్సి వచ్చింది. ఈ ఘటన దేశ రాజధాని డిల్లీ శివారులోని గుర్‌‌గ్రావ్ లో చోటుచేసుకుంది.

ఈ ఘటనకకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గత  ఆదివారం బజ్‌గేరా ప్రాంతంలోని ఓ కాలువలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. కాటన్ బ్యాగులో మృతదేహాన్ని కుక్కి తాడుతో కట్టి కాలువలో పడేశారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి మార్చురీకి తరలించారు. గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

అయితే ఈ నెల 17వ తేదీ జోగీందర్‌ సింగ్‌ అనే వ్యక్తి కనిపించడం లేదంటూ అతడి సోదరుడు గుర్ గ్రావ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు మార్చరీలో వున్న మృతదేహాన్ని చూపించగా అది తన సోదరుడిదేనని గుర్తించాడు. దీంతో అతడి ద్వారా మృతుడి వివరాలను సేకరించిన పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు. 

ఈ సమాచారాన్ని ఆసరాగా చేసుకుని మృతుడి భార్య స్వీటీని  తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించేవాడని...ప్రియురాలిని పెళ్లి చేసుకుని ఈ ఆస్తిని ఆమె పేరిట రాస్తాడేమోనన్న అనుమానంతో అతన్ని హతమార్చాలని పథకం వేసినట్లు  స్వీటి  వెల్లడించింది. భర్త జోగేందర్ ని అంతమొందించడానికి ఓ సుపారీ గ్యాంగ్ తో రూ.16లక్షలతో ఒప్పందం కుదుర్చచుకున్నట్లు తెలిపింది. 

వీరు రూపొందించిన పథకం ఈ నెల 16తేదీన ఇంట్లో తన భర్త పడుకున్నాడని స్వీటి కిరాయి హంతకులకు సమాచారం అందించింది. ఆమె సహయకారంతో ఇంట్లోకి  ప్రవేశించిన దుండగులు అతడు నిద్రలో ఉండగానే దాడిచేసి హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని ఓ గోనెసంచిలో కుక్కి కాలువలో పడేసినట్లు స్విటీ పోలీసులకు తెలిపింది. 

దీంతో ఆమెపై హత్యానేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు జైలుకు తరలించారు. ఈ హత్యలో ఆమెకు సహకరించిన ఉత్తర ప్రదేశ్, డిల్లీ ప్రాంతాలకు చెందిన కిరాయి ముఠాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.