అపర కుభేరుల ఇళ్లల్లో పెళ్లి అంటే మాటలా..? కోట్లకు కోట్లు మంచినీళ్ల మాదిరిగా ఖర్చు చేసేస్తారు.  ఒక్క పెళ్లికి ఓ ధనవంతుల కుటుంబం ఏకంగా రూ.200కోట్లు ఖర్చు పెట్టింది. అయితే... వీళ్లు పెళ్లి ఖర్చుకన్నా కూడా.. వీరి పెళ్లి కారణంగా మున్సిపాలిటీ సిబ్బంది పడిన ఇబ్బందులే తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

ఇంతకీ మ్యాటరేంటంటే... భారత్‌కు చెందిన గుప్తా కుటుంబం కొన్ని దశాబ్దాల క్రితమే దక్షిణాఫ్రికాలో స్థిరపడింది. అనేక వ్యాపారాలు చేస్తూ సంపన్న కుటుంబంగా ఎదిగింది. ఇటీవల గుప్తాల ఇంట్లో రెండు పెళ్లిళ్లు జరిగాయి. ఉత్తరాఖండ్‌లోని ఔలీ ప్రాంతంలో బిలియనీర్‌ అజయ్‌ గుప్తా కుమారుడు సూర్యకాంత్‌ వివాహం జూన్‌ 18-20 మధ్య, అజయ్‌ సోదరుడు అతుల్‌ గుప్తా కుమారుడు శశాంక్‌ వివాహం జూన్‌ 20-22 మధ్య జరిగింది. 

పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బాలీవుడ్‌ నటులు, యోగా గురు బాబా రాందేవ్‌ సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. పెళ్లి వేడుకల కోసం ఔలీలోని హోటళ్లు, రిసార్టులను గుప్తా కుటుంబం బుక్‌ చేసుకుంది. దాదాపు రూ. 200కోట్లు ఖర్చుపెట్టి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు.

అయితే, ఈ వేడుకల తర్వాత ఔలీలో ఎక్కడ చూసినా చెత్తే కన్పిస్తోందట. ప్లాస్టిక్‌ ప్యాకెట్లు, బాటిళ్లు ఎక్కడపడితే అక్కడ పడేశారట. గుప్తాల వివాహం వల్ల 150 క్వింటాళ్లపైనే చెత్త పోగైనట్లు మున్సిపల్‌ అధికారులు తెలిపారు. ఈ చెత్తను శుభ్రం చేసేందుకు 20 మందితో బృందాన్ని నియమించినట్లు చెప్పారు. అయితే.. ఈ చెత్త అంతటినీ తొలగించలేక మున్సిపాలిటీ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారన్న వార్త నెట్టింట వైరల్ అయ్యింది.

దీంతో.. చెత్తను తొలగించినందుకు గాను గుప్తా కుటంబీకులు రూ.54వేలు చెల్లించడానికి సిద్ధపడ్డారు. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారి ఒకరు తెలిపారు.

ఇదిలా ఉండగా... గుప్తాల వివాహ వేడుకపై ఇటీవల న్యాయస్థానంలో పిటిషన్‌ కూడా దాఖలైంది. ఈ వేడుకలతో ఔలీలో పర్యావరణానికి హాని కలుగుతుందని పిటిషన్‌దారులు పేర్కొన్నారు. దీనిపై విచారించిన న్యాయస్థానం.. పర్యావరణ కాలుష్యం జరగకుండా చూసుకోవాలంటూ గుప్తా కుటుంబాన్ని సూచించింది. మరోసారి ఈ కేసు జులైలో హియరింగ్ కి రానుంది.