హోంవర్క్ సరిగా చేయలేదని చిన్నారిపై టీచరమ్మ కర్కషం.. వీపుపై వాతలు వచ్చేలా.. 35సార్లు..
హోంవర్క్ చేయలేదని విద్యార్థిని పట్ల ఓ టీచరమ్మ దారుణంగా వ్యవహరించింది. వీపుపై వాతలు వచ్చేలా కొట్టింది. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్ జిల్లా పునాగం ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది
ఇటీవల చిన్నారుల పట్ల ఉపాధ్యాయులు కర్కషంగా వ్యవహరిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. గత వారం రోజుల క్రితం హైదరాబాద్ లో హోంవర్క్ చేయలేదని ఓ స్కూల్ టీచర్ చిన్నారి తలపై పలకతో దాడి చేసింది. దీంతో ఆ బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. తాజాగా మరో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల చిన్నారి హోంవర్క్ సరిగా చేయలేదని ఓ టీచరమ్మ ఆగ్రహంతో ఊగిపోయింది.
ఆ చిన్నారి పట్ల అత్యంత పైశాచికంగా ప్రవర్తించింది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 35 సార్లు ఆ చిన్నారి వీపు దారుణంగా కొట్టింది. ఈ కర్కష దృశ్యాలన్నీ తరగతి గదిలో ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ ఫుటేజీలు బయటకు రావడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గుజరాత్ లోని సూరత్‌లోని ఓ పాఠశాలలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. గుజరాత్‌లోని సూరత్ జిల్లా పునాగం ప్రాంతంలో ఉన్న సాధన నికేతన్ పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలు నాలుగేళ్ల విద్యార్థిని పట్ల అత్యంత పైశాచికంగా ప్రవర్తించింది. హోంవర్క్ సరిగ్గా చేయలేదని ఆ చిన్నారి వీపుపై దారుణంగా కొట్టింది. దీంతో ఆ చిన్నారి వీపు కమిలిపోయింది. ఎప్పటిలాగే స్కూల్ నుంచి వచ్చిన తమ చిన్నారి యూనిఫాం మారస్తున్న తల్లి షాక్ అయ్యింది.
ఆ చిన్నారి వీపుపై దెబ్బలు చూసి ఆ తల్లి తల్లాడింది. దీంతో ఆగ్రహించిన ఆ చిన్నారి తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి.. యాజమాన్యాన్ని నిలదీశారు. అసలేం జరిగిందో తెలియజేయాలని పట్టుబడ్డారు. ఈ విషయమై సదరు టీచర్ ను కూడా ప్రశ్నించారు. అయితే.. హోం వర్క్ సరిగా చేయలేదని తాను కేవలం ఒక్కటే దెబ్బ కొట్టానని ఆ టీచరమ్మ తెలిపింది.
కానీ.. ఆ చిన్నారి పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఒకటి , రెండు దెబ్బలు వేస్తే.. పరిస్థితి ఇంత దారుణంగా ఉండదని అనుమానం వ్యక్తం చేశారు. తరగతి సీసీటీవీ పుటేజీలు చూపించాలని బాధిత బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఫుటేజీలో ఆ టీచరమ్మ అత్యంత పాశవికంగా ప్రవర్తించింది. ఆ చిన్నారిని ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 35 సార్లు కొట్టినట్లుగా స్పష్టంగా కనిపించింది.
దీంతో సంబంధిత టీచర్ పై చర్యలు తీసుకోవాలని బాధిత చిన్నారి తల్లిదండ్రలు, బంధువులు డిమండ్ చేయగా .. సదరు టీచర్ ను విధుల నుంచి తొలగించింది ఆ పాఠశాల యాజమాన్యం. మరోవైపు అనంతరం బాలిక తల్లిదండ్రులు కపోద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆ స్కూల్ మహిళా టీచర్‌ను బుధవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. టీచర్ జశోదాబెన్ ఖోఖారియాను అరెస్టు చేసి పలు సెక్షన్ కింద అభియోగాలు మోపినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విపుల్ పటేల్ తెలిపారు. చిన్నారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. తాము టీచర్ జశోదాబెన్‌ను అరెస్టు చేసామని పటేల్ చెప్పారు.
మరోవైపు విద్యాశాఖ కూడా ఈ ఘటనపై సీరియస్ అయ్యింది. ’’ తాను పాఠశాలను సందర్శించాను. CCTV ఫుటేజీని తనిఖీ చేసాను. సంఘటన వాస్తవమని కనుగొన్నాను. నిందితుడు టీచర్, స్కూల్ ప్రిన్సిపాల్ తదితరుల నుంచి కూడా వాంగ్మూలాలు తీసుకున్నాం. మా ప్రాథమిక పరిశోధనల తర్వాత ఉపాధ్యాయుడు విద్యార్థిని నిర్దాక్షిణ్యంగా కొట్టాడని తేలింది’’ అని సూరత్ జిల్లా విద్యాశాఖ అధికారి దీపక్ దర్జీ తెలిపారు.
కాగా..ఈ దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రఫుల్ పన్సేరియా ఘటనపై దృష్టి సారించారు. "ఇటువంటి సంఘటనకు కారణమైన వ్యక్తులను వదిలిపెట్టరు. వారు కఠినంగా శిక్షించబడతారు" అని మంత్రి అన్నారు . రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటే వెంటనే జిల్లా విద్యాశాఖాధికారికి సమాచారం అందించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.