Gujarat rains: గుజరాత్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాజ్‌కోట్‌లోని సివిల్ హాస్పిటల్‌లో మంగళవారం వరదలు ముంచెత్తాయి. ఆస్పత్రిలోని అండర్ గ్రౌండ్‌లోకి వర్షపు నీరు చేరడంతో రోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
Heavy Rain In Gujarat: దేశంలోని చాలా ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గోడ కూలి ఎనిమిది మంది మరణించారు. రాష్ట్రంలో వరదల కారణంగా వేలాది మంది ప్రజలు నష్టపోయారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం అహ్మదాబాద్, రాజ్‌కోట్‌తో సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలను నాశనం చేసింది. గుజరాత్‌లో వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా ఇప్పటివరకు మొత్తం 64 మంది మరణించారు. వీరిలో పిడుగుపాటుకు గురై 33 మంది, గోడ కూలి 8 మంది, వరద నీటిలో మునిగి 16 మంది, భారీ వర్షం కారణంగా చెట్లు కూలి మీదపడి 6 మంది, విద్యుత్ స్తంభం పడి ఒకరు మృతి చెందారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. గత రాత్రి రాజ్‌కోట్‌లో 7 సెంటీమీటర్ల వర్షం కురిసిందని అధికారులు వెల్లడించారు. గుజరాత్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక నగరాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి.
రానున్న రోజుల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలోనే రానున్న 24 గంటలపాటు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రాజ్ కోట్ కు హెచ్చరిక జారీ చేసింది. దీంతో నగర పాలక సంస్థ.. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించింది. నగరంలో వరదల వంటి పరిస్థితిని అరికట్టడానికి రాజ్‌కోట్‌లోని అజీ-2 డ్యామ్ నాలుగు గేట్లు తెరిచారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సోమవారం నాడు కేవలం మూడు గంటల్లో 115 మిమీ ప్లస్ వర్షపాతంతో అహ్మదాబాద్‌ను వరదలు ముంచెత్తాయి. గత 5 సంవత్సరాలలో జూలైలో ఒకే రోజులో అత్యధిక రికార్డును నెలకొల్పింది. అహ్మదాబాద్‌తో సహా దక్షిణ, మధ్య గుజరాత్‌లోని జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో గత 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా వివిధ లోతట్టు ప్రాంతాలలో వరదలు సంభవించాయి. రానున్న ఐదు రోజుల్లో డాంగ్, నవ్‌సారి, వల్సాద్, తాపి, సూరత్‌లలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఈ ప్రాంతాలు భారీ వర్షం కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
గుజరాత్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాజ్‌కోట్‌లోని సివిల్ హాస్పిటల్‌లో మంగళవారం వరదలు ముంచెత్తాయి. ఆస్పత్రిలోని అండర్ గ్రౌండ్ లోకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో రోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. రోగుల బంధువులు వర్షపునీటిలో నడుస్తూ ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వరదలు, రైల్వే ట్రాక్ లపై వర్షపు నీరు చేరడంతో పలు సర్వీసులను నిలిపివేస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.
