Asianet News TeluguAsianet News Telugu

Gujarat polls: "ఒక్క అవ‌కాశ‌మివ్వండి.. 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం"

Gujarat polls: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రచారాన్ని ముమ్మరం చేసింది. రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి  అరవింద్ కేజ్రీవాల్ గిరిజనులు అధికంగా ఉండే ఛోటాడేపూర్ జిల్లాలో జరిగిన బహిరంగ ర్యాలీలో నిర్వ‌హించారు. అధికారంలోకి వ‌స్తే..10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

Gujarat polls Arvind Kejriwal promises 10 lakh govt jobs
Author
Hyderabad, First Published Aug 7, 2022, 5:29 PM IST

Gujarat polls: గుజరాత్ లో ఎలాగైనా అధికారం చేప‌ట్టాల‌ని ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్ ప్రయ‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆ రాష్ట్ర సుడిగాలి ప‌ర్య‌ట‌న చేస్తూ.. ఆ రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌పై హామీల వ‌ర్షాన్ని కురిపించారు. తాజాగా త‌న‌ రెండు రోజుల‌ గుజరాత్ పర్యటనలో భాగంగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు వడోదరలో ప‌ర్య‌టించారు. అనంత‌రం వడోదర సిటీలో నిర్వ‌హించిన‌ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. బీజేపీపై విమ‌ర్శాస్త్రాలు సంధించారు. తమ సమావేశాలకు హాజరుకాకుండా వ్యాపారులను బెదిరిస్తున్నారని బీజేపీపై ఆరోపణలు చేశారు. అదే సమయంలో.. గుజ‌రాత్ లో ఒక్క సారి అధికారం ఇచ్చి ఉండాల‌ని కోరారు. గుజరాత్ ప్రజలపై హామీల వర్షం కురిపించారు. 

నేడు గుజరాత్ మొత్తం త‌న‌కు అండగా నిలుస్తోందని, ఆ పార్టీ చేసిన సర్వేలో ఇది ప్రస్తావనకు వచ్చిందని కేజ్రీవాల్ అన్నారు. ఇప్పుడు గుజరాత్‌లో బీజేపీ-కాంగ్రెస్ రాజకీయాలు ముగుస్తాయనీ, ప్రజల రాజకీయాలు మాత్రమే నడుస్తాయని అన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కేవ‌లం ఆప్, బీజేపీ మధ్య ప్రత్యక్ష పోటీ ఉందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. బీజేపీ-కాంగ్రెస్ మధ్య ఐఎల్‌యూ సంబంధం కొనసాగుతోందని ఆరోపించారు. బీజేపీకి.. ఆప్ ప్రత్యామ్నాయంగా వచ్చిందని సీఎం కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ నేతలు అహంకారంతో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నీ, వారికి ప్రజల స‌మ‌స్య‌లు ప‌ట్ట‌డం లేద‌ని అన్నారు.  

అరవింద్ కేజ్రీవాల్ హామీలు

ఈ సంద‌ర్బంగా.. కేజ్రీవాల్ గుజ‌రాత్ ప్ర‌జ‌ల‌పై హ‌మీలు గుప్పించారు. ఒక‌సారి అధికారం ఇచ్చి చూడ‌మ‌ని గుజ‌రాత్ ప్ర‌జ‌ల‌ను కోరారు. త‌మ పార్టీని గెలిపిస్తే.. అందరికీ ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు.. గుజ‌రాత్ లో 10 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. అదే స‌మ‌యంలో నిరుద్యోగులకు నెలకు రూ.3000 భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు.. గుజరాత్ కో-ఆపరేటివ్‌ రంగంలో ఉద్యోగాలన్నీ.. ప్ర‌ధాని మోడీ త‌న‌ సన్నిహితులు, బంధువులకు ఇచ్చార‌ని ఆరోపించారు. ఆప్‌ను గెలిపిస్తే.. అత్యంత పారదర్శకంగా నియామకాలు చేస్తామ‌ని, పేపర్‌ లీక్‌లు కుంభ‌కోణాలు జ‌ర‌గ‌కుండా చూసుకుంటామ‌ని అన్నారు. 

ఢిల్లీలో ఇప్ప‌టివ‌ర‌కు 12 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. అలాగే.. ఇటీవల అధికారంలోకి వచ్చిన పంజాబ్‌లో దాదాపు 25 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ క‌ల్పిస్తున్నామ‌ని  ఆ సంఖ్య 51 లక్షలకు పెరుగుతుందన్నారు. తాము అధికారంలోకి వ‌స్తే.. గుజరాత్‌లో కూడా 24 గంటలు నిర్విరామంగా విద్యుత్ అందిమ‌ని తెలిపారు. 

గుజరాత్ లో ఉచిత విద్యుత్ ఇస్తామని, గతంలో ఉన్న విద్యుత్ బకాయిల‌ను మాఫీ చేస్తామ‌ని హామీ ఇచ్చారు. మహిళలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. ప్రతి గిరిజన ప్రాంతంలో పాఠశాలలు తెరుస్తాం. దీంతో పాటు ప్రతి గ్రామంలోనూ మొహల్లా క్లినిక్‌లను ఒపెన్ చేస్తామ‌నీ, తద్వారా సమాజంలోని వెనుకబడిన ప్రజలు నాణ్య‌మైన‌ ఆరోగ్య సౌకర్యాలు పొందుతారని అన్నారు. గిరిజనులకు రాజ్యాంగంలోని 5వ నిబంధనను అమలు చేస్తాం, దానిని కచ్చితంగా పాటిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఈ క్ర‌మంలో ఢిల్లీ లో చేప‌ట్టిన అభివృద్ధి, సంక్షేమ పథ‌కాల‌ను వివ‌రించారు.

Follow Us:
Download App:
  • android
  • ios