లాక్ డౌన్: తండ్రి శవంతో మతి స్థిమితం లేని కొడుకు.. ఇంట్లోనే..
తాజాగా ఓ వ్యక్తి ఇంట్లో ప్రాణాలు కోల్పోతే.. అతని శవానికి అంత్యక్రియలు నిర్వహించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీంతో.. అతని శవంతో అతని కుమారుడు మూడు రోజులు ఇంట్లోనే ఉన్నాడు. ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ ని అరికట్టేందుకు ముందుగానే దేశంలో లాక్ డౌన్ విధించారు. అయినా.. కరోనా కేసులు పెరిగిపోతుండటంతో లాక్ డౌన్ మరింత పొడిగించారు. అయితే... ఈ లాక్ డౌన్ కారణంగా సామాన్య ప్రజలు కొందరు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
కొందరికి తినడానికి తిండి, తాగడానికి నీరు. చేతిలో రూపాయి సంపాదన లేక విలవిలలాడుతుంటే.. మరికొందరు అనారోగ్యంతో ఉంటే ఆస్పత్రులకు కూడా వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఇంట్లో ప్రాణాలు కోల్పోతే.. అతని శవానికి అంత్యక్రియలు నిర్వహించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీంతో.. అతని శవంతో అతని కుమారుడు మూడు రోజులు ఇంట్లోనే ఉన్నాడు. ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ కి చెందిన ఓ 75ఏళ్ల వృద్ధుడు అనారోగ్యం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. అతని శవంతో దాదాపు మూడు రోజులు అతని కుమారుడు ఇంట్లోనే ఉండిపోయాడు. ఆ ఇంట్లో నుంచి ఎవరూ కనీసం బయటకు కూడా రాకపోవడంతో అనుమానంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల సమాచారంతో ఆ ఇంటికి చేరిన పోలీసులు.. తలుపులు బద్దలు కొట్టి చూడగా.. శవం పక్కనే కుమారుడు కూర్చొని ఉన్నాడు.
అయితే.. సదరు వృద్ధుడి కుమారుడికి మతిస్థిమితం లేకపోవడం గమనార్హం. ఆ ఇంట్లో వృద్ధుడు, అతని భార్య, మతిస్థిమితం లేని కొడుకు ఉండేవారు. సదరు వృద్ధుడి భార్య పనిమీద ముంబయి వెళ్లింది. ఆమె అక్కడకు వెళ్లినతర్వాత లాక్ డౌన్ విధించారు. దీంతో ఆమె ఇంటికి చేరుకోవడం కుదరలేదు.
ఈ క్రమంలో వృద్ధుడు ప్రాణాలు కోల్పోగా.. అతని మతి స్థిమితం లేని కుమారుడు శవం పక్కన కూర్చొని ఉండిపోయాడు. చనిపోవడానికి ముందు వృద్ధుడు వేరే ప్రాంతంలో ఉన్న తన కుమార్తెకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో.. సదరు మహిళ ఇంటి పక్క వారికి ఫోన్ చేసి తన తండ్రి ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోవాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది.
అయితే.. స్థానికులు ఎన్నిసార్లు తలుపు కొట్టినా.. ఆ మతిస్థిమితం లేని వ్యక్తి డోర్ తెరవలేదు. మూడు రోజుల తర్వాత స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా.. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు.