వడొదర: అచ్చం 1990 దశకంలో వచ్చిన అంజామ్ లోని ఓ దృశ్యాన్ని తలపించే సంఘటన గుజరాత్ లో జరిగింది. ఉద్యోగం లేని అహ్మదాబాద్ కు చెందిన ఓ ఐటి ఇంజనీర్ ఎస్ఆర్కే స్టంట్ మాదిరిగా ప్రేయసిపై తీవ్రమైన నిస్పృహతో కారును తగులబెట్టుకున్నాడు. 

ఈ సంఘటన వడొదరలోని వడివాడి సమీపంలోని ఆర్సీ దత్ రోడ్డులో మంగళవారం చోటు చేసుకుంది. ప్రేయసిపై కోపంతో బొంబాయి షాపింగ్ సెంటర్ లోని ఓ ఇరుకు మార్గంలో కాను తగులబెట్టాడు. తొలుత అతను తన కారువిండ్ షీల్డ్ ను, గ్లాస్ పేన్స్ ను రాళ్లతో ధ్వంసం చేశాడు. ఆ తర్వాత చెత్తను తీసుకుని కారులో వేశాడు. చివరగా దాన్ని తగులబెట్టాడు. సంఘటనా స్థలంలో గుమికూడిన వ్యక్తులపై రాళ్లతో దాడి చేసినట్లు కూడా చెబుతున్నారు.

స్థానికులు పోలీసు కంట్రోల్ రూంకు, ఫైర్ బ్రిగేడ్ కు సమాచారం అందించారు. అతన్ని అరెస్టు చేయడానికి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తగులబెట్టిన కారు అతనిదేనని తెలుసుకున్నారు. తమతో సాయాజీగంజ్ పోలీసు స్టేషన్ కు రావాలని పోలీసులు అతనికి చెప్పారు. తొలుత తిరస్కరించిన అతను తర్వాత ఆటో రిక్షాలో వారితో వెళ్లాడు. ఈలోగా మంటలను ఆర్పేశారు. 

అహ్మదాబాద్ నుంచి తండ్రి వచ్చేంత వరకు అతను ఏది అడిగినా నోరు విప్పలేదు. తండ్రి వచ్చిన తర్వాత నోరు తెరిచి కోపంతో ఆ పనిచేసినట్లు తెలిపాడు. హామీ ఇచ్చి కూడా ప్రేయసి రాకపోవడంతో తనకు కోపం వచ్చిందని, దాంతో ఆ పనిచేశానని చెప్పాడు. గర్ల్ ఫ్రెండ్ వివరాలను అతను తండ్రికి గానీ పోలీసులకు గానీ చెప్పలేదు. అయితే, కేసు ఏదీ పెట్టకుండా అతన్ని పోలీసులు వదిలేశారు.