Gujarat Hooch tragedy: గుజరాత్‌‌లో కల్తీ మద్యం తాగి మృతి చెందిన వారి సంఖ్య క్ర‌మక్ర‌మంగా పెరుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ 28 మంది అమాయ‌కులు చ‌నిపోయిన‌ట్టు తెలిపారు. ఈ క‌ల్తీ మ‌ద్యాన్ని అత్యంత విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్‌తో తయారు చేసినట్లు గుజరాత్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆశిష్ భాటియా తెలిపారు. ఈ విషాద ఘ‌ట‌న‌లో 14 మందిపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, చాలా మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

Gujarat Hooch tragedy: గుజరాత్‌‌లో కల్తీ మద్యం అమాయ‌కుల ప్రాణాలను తీసింది. బొటాడ్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి చనిపోయిన వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ విషాద ఘ‌ట‌న‌లో 28మంది చనిపోయారు. మరికొందరి పరిస్థితి అత్యంత‌ విషమంగా ఉంది. బోటాడ్ జిల్లాలోనే 16 మంది మృతి చెందగా.. ధందూకాలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన‌ట్టు అధికారులు తెలిపారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంద‌ని, వారిని అహ్మదాబాద్‌కు తరలించారని ధందూక వైద్యులు తెలిపారు. 

ఈ క‌ల్తీ మద్యాన్ని అత్యంత విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్‌తో తయారు చేసినట్లు గుజరాత్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆశిష్ భాటియా తెలిపారు. గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో డీజీపీ ఆశిష్ భాటియా మాట్లాడుతూ.. ఈ విషాదం యొక్క‌ పూర్వ‌ప‌రాల‌ను వెల్ల‌డించారు. బొటాడ్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి చ‌నిపోయే వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంద‌నీ, ఇప్ప‌టివ‌ర‌కూ 28 మంది చ‌నిపోయార‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, 14 మందిపై కేసు నమోదు చేశామ‌నీ, ప‌లువురుని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

సోమవారం ఉదయం బొటాడ్ జిల్లాలోని రోజిద్ గ్రామంలో, ఇతర సమీప గ్రామాలలో క‌ల్తీ మందు తాగి.. ప‌లువురు తీవ్ర అనారోగ్యానికి గుర‌య్యారు. వారిని బర్వాలా, బొటాడ్ పట్టణాలలోని ప్రభుత్వ ఆసుపత్రులలో చేరినప్పుడు విషయం వెలుగులోకి వచ్చింది. కల్తీ మద్యం సేవించి ఇప్పటివరకు 28 మంది మరణించారని భాటియా తెలిపారు. 

మ‌ర‌ణించిన‌ వారిలో 22 మంది బొటాడ్ జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన వారు కాగా, ఆరుగురు పొరుగున ఉన్న అహ్మదాబాద్ జిల్లాకు చెందిన వారు. ఇది కాకుండా.. ప్రస్తుతం 45 మందికి పైగా భావ్‌నగర్, బోటాడ్, అహ్మదాబాద్‌లోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. 

బాధితులు మిథైల్ ఆల్కహాల్ సేవించినట్లు ఫోరెన్సిక్ విశ్లేషణలో తేలిందని భాటియా తెలిపారు. హత్య, ఇతర నేరాల కింద 14 మందిపై కేసు నమోదు చేసి ఇప్పటికే చాలా మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామ‌ని తెలిపారు. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS), అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ కూడా దర్యాప్తులో పాల్గొంటున్నాయని తెలిపారు.

క‌ల్తీ మద్యం అమ్మేవారికి రాజకీయనాయ‌కుల ప్రోత్సాహం: కేజ్రీవాల్ 

గుజరాత్ పర్యటనలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలులో ఉన్నప్పటికీ అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కల్తీ మద్యం విక్రయిస్తున్న వారు రాజకీయ లబ్ధి పొందుతున్నారని, మద్యం విక్రయాల ద్వారా వచ్చిన సొమ్ముపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కల్తీ మద్యం సేవించి అస్వస్థతకు గురైన కొంతమందిని భావ్‌నగర్‌లోని ఆసుపత్రిని సందర్శిస్తానని కేజ్రీవాల్ మంగళవారం చెప్పారు.