గుజరాత్ హైకోర్టులో ఓ న్యాయవాది ఏకంగా 601 మంది కారుణ్య మరణాల కోసం రెండు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లు చూసిన హైకోర్టు.. న్యాయవాదిపై సీరియస్ అయింది. అసలు కారుణ్య మరణం అంటే ఏమిటో అడ్వకేట్‌కు అర్థం కాలేదేమోనని ఫైర్ అయింది. సమయం వృథా చేసే పిటిషన్లు వేసినందుకు రూ. 10 వేలు జరిమానా కట్టాలని ఆదేశించింది. 

అహ్మదాబాద్: గుజరాత్ హైకోర్టుకు చెందిన ఓ న్యాయవాది అనూహ్య రీతిలో కారుణ్య పిటిషన్ వేశారు. ఆయన కారుణ్య మరణాల కోసం రెండు పిటిషన్లు వేశారు. ఒకటేమో.. 600 మంది మత్స్యకారుల తరఫున, మరొకటి గుజరాత్ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేటషన్‌లో అవినీతిపై తన పోరాటం విజయం కానందున ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేశారు. రాష్ట్ర అధికారులు తమను పట్టించుకోవడం లేదని, కాబట్టి తమకు ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతించాలనే డిమాండ్‌తో ఈ రెండు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై గుజరాత్ హైకోర్టు సీరియస్ అయింది.

జస్టిస్ ఏఎస్ సుపేహియా.. ఈ రెండు పిటిషన్లు వేసిన అడ్వకేట్ ధర్మేష్ గుర్జార్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పిటిషన్లు దాఖలు చేసినందుకు ఒక్కో పిటిషన్‌కు రూ. 5 వేల చొప్పున రూ. 10 వేల జరిమానా ఆ అడ్వకేట్‌కు విధించారు. ఈ రెండు పిటిషన్లు పనికిమాలినవని, కోర్టు, రిజిస్ట్రీ, ప్రభుత్వ న్యాయవాదుల సమయాన్ని వృథా చేయడానికి వేసినవేనని ఆగ్రహంతో తోసిపుచ్చారు.

అంతేకాదు, ఈ అడ్వకేట్ అసలు కారుణ్య మరణం అంటే ఏమిటో కూడా అర్థం చేసుకోనట్టు ఉన్నారని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. అందుకే ఆయన క్లయింట్లను కూడా తన స్థాయికి తీసుకెళ్లాడని పేర్కొంది. అంతేకాదు, ఆ పిటిషన్‌లో ఒక్క చట్టపరమైన ప్రావిజన్లు, సెక్షన్లు పేర్కొనకపోవడాన్ని విమర్శించింది.

కాగా, రూ. 10 వేల జరిమానా తనకు విధించవద్దని, అవసరమైతే.. తన క్లయింట్లకు విధించాలని కోర్టును అడ్వకేట్ కోరారు. తనకు జరిమానా విధిస్తే తన కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపెడుతుందని అభ్యర్థించారు. కానీ, కోర్టు ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. ఈ పిటిషన్లు వేసినందుకు గాను అడ్వకేట్ పిటిషన్‌కు రూ. 5 వేల చొప్పున మొత్తం రూ. 10 వేలు చెల్లించాలని ఆదేశించింది.