Asianet News TeluguAsianet News Telugu

గుజ‌రాత్‌లో ఓడినా.. జాతీయ పార్టీ హోదా ద‌క్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ 

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా మారింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. గుజరాత్ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని జాతీయ పార్టీగా మార్చారని అన్నారు. 

Gujarat gave AAP national party status
Author
First Published Dec 8, 2022, 6:39 PM IST

గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఘోర పరాభవం ఎదురైనా.. ఓ ఉపశమనం లాంటి ఘనత సాధించింది. ఆప్ నేడు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా మారింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. గుజరాత్ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని జాతీయ పార్టీగా మార్చారని అన్నారు.గుజరాత్‌లో ఆప్ సాధించిన ఓట్ల ప్రకారం.. కేజ్రీవాల్ పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీగా అవతరించింది.

కేవలం 10 ఏళ్ల వ్యవధిలో ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలోని జాతీయ పార్టీ స్థాయికి చేరుకుంది.  దీంతో ఆప్ జాతీయ క‌న్వీన‌ర్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ..గుజరాత్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను గుజరాత్‌కు వెళ్లిన ప్రతిసారీ వారి ప్రేమ లభించిందనీ,అందుకు వారందరికీ కృతజ్ఞతతో ఉంటాననీ, గుజరాత్ బీజేపీకి కంచుకోటను ఛేదించడంలో విజయం సాధించామనీ, గుజరాత్‌లో ఆప్ కు 13 శాతం ఓట్లు వచ్చాయని తెలిపారు.

గుజరాత్‌లోని లక్షలాది మంది ప్రజలు తమ పార్టీకి ఓటు వేశారనీ, వారి మద్దతుతోనే ఈసారి కోటను బద్దలు కొట్టడంలో విజయం సాధించననీ, వచ్చేసారి కోటను గెలిపించడంలో విజయం సాధిస్తామని అన్నారు.తాము మొత్తం ప్రచారాన్ని సానుకూలంగా నడిపించామనీ, ఎవరినీ దుర్భాషలాడలేదని అన్నారు. కేవలం మేం చేయబోయే పని గురించి మాట్లాడమనీ, ఇదే మమ్మల్ని ఇతర పార్టీల నుండి వేరు చేస్తుందనీ, ఇప్పటి వరకు మిగిలిన పార్టీలు మత, కుల రాజకీయాలు చేస్తున్నాయన్నారు. ఒక పార్టీ పని గురించి మాట్లాడటం ఇదే తొలిసారని తెలిపారు.

దేశంలో ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయి?

దేశంలో 8వ జాతీయ పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ అవతరించింది. గతంలో దేశంలో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, టీఎంసీ లు జాతీయ పార్టీ హోదాను కలిగి ఉన్నాయి. దేశంలో జాతీయ పార్టీలే కాకుండా రాష్ట్ర స్థాయి పార్టీలు, ప్రాంతీయ స్థాయి పార్టీలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి స్థాయి కూడా భిన్నంగా ఉంటుంది.

జాతీయ పార్టీ హోదా ఎలా ఇస్తారు?

ఏ రాజకీయ పార్టీ అయినా జాతీయ పార్టీగా అవతరించేందుకు అనేక ప్రమాణాలు పాటించాలి.కేంద్ర ఎన్నికల సంఘం-1968 నిబంధన ప్రకారం.. ఈ మూడు నిబంధనల్లో కనీసం ఏదో ఒక నిబంధనను పూర్తి చేయాల్సి ఉంటుంది.

1. సాధారణ ఎన్నికల్లో పార్లమెంట్‌ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో పోటీ చేయాలి. ఆ ఎన్నికల్లో పోలైన ఓట్లలో ఆరు శాతం ఓట్లను పొందాలి.  
2. ఏవైనా నాలుగు రాష్ట్రాల్లో 11 లోక్‌సభ సీట్లు లేదా పార్లమెంట్ లో రెండు శాతం సీట్లు సాధించాలి.  
3. కనీసం నాలుగు రాష్ట్రాల్లో  ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి. జాతీయ పార్టీగా పేరు నమోదు చేసుకొనే పార్టీ గుర్తు.. దేశంలోని మరే ఇతర పార్టీ చిహ్నంగా ఉండకూడదు.

ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లు ఎక్కడ?

జాతీయ పార్టీగా అవతరించిన ఆప్ ఢిల్లీ, పంజాబ్, ఢిల్లీ ఎంసీడీలలో ప్రభుత్వాల్లో అధికారం చేలాస్తుంది. అదే సమయంలో గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ రెండు స్థానాల్లో విజయం సాధించి 6.77 శాతం ఓట్లు సాధించింది. ఇప్పుడు గుజరాత్‌లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి దాదాపు 13 శాతం ఓట్లు వచ్చాయి. ఈ విధంగా నాలుగు రాష్ట్రాల్లో 6 శాతానికి పైగా ఓట్లు సాధించి..  8వ జాతీయ పార్టీగా అవతరించింది.

Follow Us:
Download App:
  • android
  • ios