Asianet News TeluguAsianet News Telugu

Gujarat Elections: సహోద్యోగుల‌పై కాల్పులు.. ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి

Porbandar: గుజ‌రాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తొలి విడతలో పోర్‌బందర్ జిల్లాలో డిసెంబర్ 1న ఓటింగ్ నిర్వహించనున్నారు. అయితే, తాజాగా ఒక ఎన్నిక‌ల విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ జ‌వాను కాల్పులు జ‌ర‌ప‌డంతో ఇద్ద‌రు మ‌ర‌ణించగా, మ‌రో ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు. 
 

Gujarat Elections: Two CRPF jawans killed in firing on colleagues in Porbandar district
Author
First Published Nov 27, 2022, 1:59 AM IST

Gujarat Elections: గుజ‌రాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాల్పులు చోటుచేసుకోవడం క‌ల‌క‌లం రేపింది. ఈ కాల్పుల ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోగా, మ‌రో ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న పోర్‌బందర్ లో చోటుచేసుకుంది. ప్రాణాలు కోల్పోయిన ఇద్ద‌రు సీఆర్పీఎఫ్ జ‌వాన్లు మ‌ణిపూర్ కు చెందిన వార‌ని స‌మాచారం. 

ఈ కాల్పుల ఘ‌ట‌న గురించి పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. ఎన్నిక‌ల విధుల్లో ఉన్న ఒక‌ సహోద్యోగి కాల్పులు జరపడంతో ఇద్దరు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్లు మరణించారు. మ‌రో ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు. సీఆర్పీఎఫ్ జ‌వాన్లు మ‌ర‌ణించిన ఈ ఘ‌ట‌న గుజ‌రాత్ లోని పోర్‌బందర్ లో శ‌నివారం నాడు చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన జవాన్లందరూ మణిపూర్‌కు చెందిన సీఆర్పీఎఫ్ బెటాలియన్‌కు చెందినవారని పోర్‌బందర్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎఎం శర్మ తెలిపారు. కాగా, వ‌చ్చే నెల‌లో ఈ ప్రాంతంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న త‌రుణంలో పోర్‌బందర్ లో విధులు నిర్వ‌హించ‌డానికి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ను మోహ‌రించిన‌ట్టు ఆయ‌న తెలిపారు.

అయితే, స‌ద‌రు సీఆర్పీఎఫ్ జ‌వాను ఎందుకు కాల్పులు ప‌రిపాడు అనేదానికి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియ‌లేదు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తొలి విడతలో పోర్‌బందర్ జిల్లాలో డిసెంబర్ 1న ఓటింగ్ నిర్వహించనున్నారు. పోర్‌బందర్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని తుక్డా గోసా గ్రామంలోని తుఫాను కేంద్రంలో జవాన్లు బస చేశారు. ఎన్నికల విధుల్లో జిల్లాకు వచ్చే సీఆర్పీఎఫ్ జవాన్లకు ఈ కేంద్రాన్ని వసతిగా ఉపయోగిస్తున్నట్లు పీటీఐ నివేదించింది. జిల్లా ఎన్నికల అధికారి ఎఎం శర్మ  మాట్లాడుతూ.. "శనివారం సాయంత్రం ఏదో తెలియని సమస్యపై ఒక జవాన్ తన సహోద్యోగులపై రైఫిల్‌తో కాల్పులు జరిపాడు. ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు" అని తెలిపారు. గాయ‌ప‌డ్డ సీఆర్పీఎఫ్ జవాన్లను జామ్‌నగర్‌లోని ఆస్పత్రిలో చేర్చారు. వారిలో ఒకరికి కడుపులో బుల్లెట్ గాయం కాగా, మరొకరి కాలికి తగిలిందని శర్మ తెలిపారు. తదుపరి విచారణను పోలీసులు నిర్వహిస్తారని వెల్ల‌డించారు.

కాగా, గుజరాత్ అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 1, 5న రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలోనే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా భద్రతా బలగాలు, పోలీసులను మోహరిస్తున్నారు. డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడికానున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios