Ahmedabad: గుజరాత్‌లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ప్రధాన పోటీదారుగా తమను తాము ప్రదర్శించుకోవడానికి ప్రయత్నిస్తున్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ (ఆప్) దూకుడు పెంచింది. గుజరాత్ ఎన్నికల కోసం తన అభ్యర్థుల 11వ జాబితాను విడుదల చేసింది.
Gujarat Elections 2022: గుజరాత్ లో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. గుజరాత్‌లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ప్రధాన పోటీదారుగా తమను తాము ప్రదర్శించుకోవడానికి ప్రయత్నిస్తున్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ (ఆప్) దూకుడు పెంచింది. గుజరాత్ ఎన్నికల కోసం తన అభ్యర్థుల 11వ జాబితాను విడుదల చేసింది. రానున్న ఎన్నికల్లో తమదే విజయమని ఆప్ ధీమా వ్యక్తం చేస్తోంది.
వివరాల్లోకెళ్తే.. రాబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సోమవారం పాటిదార్ కోటా మాజీ నాయకుడు అల్పేష్ కతిరియాతో సహా మరో 12 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే కిషోర్ కనానికి చెందిన సూరత్ నగరంలోని పాటిదార్ ప్రాబల్యం ఉన్న వరచా రోడ్ స్థానం నుండి కతిరియాకు టిక్కెట్ ఇచ్చింది. కతిరియా కోటా స్పియర్‌హెడ్ హార్దిక్ పటేల్‌కు సన్నిహితుడు. ఆయన ఈ సంవత్సరం ప్రారంభంలో కాంగ్రెస్‌ను విడిచిపెట్టి బీజేపీలో చేరారు. సూరత్‌లోని ఓల్పాడ్ స్థానానికి మరో పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (PAAS) నాయకుడు ధార్మిక్ మాలవ్యను ఎంపిక చేశారు. ఇతర ఆప్ అభ్యర్థుల వివరాలు గమనిస్తే.. బీటీ.మహేశ్వరి గాంధీధామ్ స్థానం నుండి పోటీ చేయనున్నారు. ఎంకే.బొంబాడియా (దంతా), రమేష్ నభాని (పాలన్‌పూర్), ముఖేష్ ఠక్కర్ (కంక్రేజ్), లాల్జీ ఠాకోర్ (రాధన్‌పూర్), రాజేంద్రసింగ్ పర్మార్ (మొడసా), ఉమేష్ మక్వానా (బొటాద్) లు ఆప్ ప్రకటించిన జాబితాలో ఉన్నారు.
రాహుల్ భువా, దినేష్ జోషికి వరుసగా రాజ్‌కోట్ ఈస్ట్, రాజ్‌కోట్ వెస్ట్ స్థానాలకు టిక్కెట్లు ఇవ్వబడ్డాయి. ప్రస్తుతం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) ఆధీనంలో ఉన్న పోర్‌బందర్‌లోని కుటియానా స్థానం నుండి భీమాభాయ్ మక్వానాను ఆప్ బరిలోకి దింపుతోంది.
కాగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. రెండు దశల్లో ఇక్కడ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికలు సంఘం ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో జరగనున్న 182 మంది సభ్యుల గుజరాత్ అసెంబ్లీకి ఇప్పటి వరకు 130 మంది అభ్యర్థులను ఆప్ ప్రకటించింది. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న వెలువరిస్తామని ఈసీ వెల్లడించింది. ఈ సారి ఏలాగైన గుజారత్ అధికార పీఠం దక్కించుకోవాలని ఆప్ వ్యూహాలు రచిస్తోంది. ఇదివరకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పార్టీ సూరత్ మున్సిపల్ కార్పొరేషన్‌లో గతేడాది 27 సీట్లు గెలుచుకుంది.
ఢిల్లీ తర్వాత పంజాబ్ తిరుగులేని విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదే జోష్ ను ప్రధాని స్వరాష్ట్రంలో గుజరాత్ లో కూగా కొనసాగించడానికి పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతోంది ఆప్. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ తో పాటు ఆ పార్టీ అగ్రనాయకత్వం గుజరాత్ లో వరుస పర్యటనలు, ర్యాలీలు నిర్వహిస్తోంది.
