Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్ ఎన్నికలు : నేడే రెండో దశ ఓటింగ్.. బరిలో 833 మంది .. టెన్షన్ లో వీఐపీ అభ్యర్థులు .. 

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ  పోలింగ్ కు సంబంధించి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. నేడు (డిసెంబర్ 5) రాష్ట్రంలోని 14 జిల్లాలోని  మొత్తం 93 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనున్నది.  ఈ దశలో పోలింగ్ లో 61 రాజకీయ పార్టీలకు చెందిన 833 మంది అభ్యర్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

Gujarat Elections 2022: In phase 2 voting, over 2.51 cr voters to decide fate of 833 candidates for 93 seats
Author
First Published Dec 5, 2022, 3:55 AM IST

గుజరాత్ ఎన్నికలు 2022-రెండో దశ పోలింగ్: గుజరాత్ లో జోరుగా సాగిన హై-వోల్టేజ్ ప్రచారం ముగిసిన తరువాత హై-స్టేక్ రాజకీయ పోరుకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు చివరి దశ పోలింగ్ సోమవారం (డిసెంబర్ 5న) జరగనుంది. ఈ రెండోదశ  పోలింగ్ లో ఉత్తర, మధ్య గుజరాత్‌లోని 14 జిల్లాల్లోని 93 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనున్నది. గుజరాత్ ఎన్నికల రెండో విడతలో 61 రాజకీయ పార్టీలకు చెందిన 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి భవితవ్యాన్ని 2.51 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు.

భారీ ఏర్పాటు.. 

అహ్మదాబాద్, గాంధీనగర్, మెహసానా, పటాన్, బనస్కాంత, సబర్‌కాంత, ఆరావళి, మహిసాగర్, పంచమహల్, దాహోద్, వడోదర, ఆనంద్, ఖేడా మరియు ఛోటా ఉదయపూర్ జిల్లాల్లోని 93 స్థానాలు రెండో దశలో ఉన్నాయి. రెండవ దశ పోలింగ్ కోసం ఎన్నికల సంఘం 26,409 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసింది. దాదాపు 36,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లను (ఈవీఎంలు) వినియోగించనుంది. ఎన్నికలను సులభతరం చేసేందుకు 14 జిల్లాల్లో దాదాపు 29,000 మంది ప్రిసైడింగ్ అధికారులు, 84,000 మంది పోలింగ్ అధికారులను మోహరించారు. గుజరాత్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పి భారతి ప్రకారం..  మొత్తం 26,409 పోలింగ్ స్టేషన్లలను ఏర్పాట్లు చేశారు.

ఇందులో 93 మోడల్ పోలింగ్ బూత్‌లు, 93 పర్యావరణ అనుకూల బూత్‌లు, మరో 93 దివ్యాంగులు కోసం, మరో 14 బూతులను యువత కోసం ఏర్పాటు చేశారు. అదే సమయంలో 13,319 పోలింగ్ బూత్‌లలో వెబ్‌కాస్టింగ్ చేయనున్నారు. మొత్తం 2,51,58,730 మంది ఓటర్లు ఓటు వేస్తారని, ఇందులో పురుషులు 1,29,26,501 మంది, మహిళలు 1,22,31,335 మంది, థర్డ్ జెండర్‌కు చెందిన వారు 894 మంది ఉన్నారని తెలిపారు.


బరిలో ఉన్న VIP అభ్యర్థులు..?

బీజేపీ, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ మొత్తం 93 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్‌ 90 స్థానాల్లో పోటీ చేయగా, దాని మిత్రపక్షమైన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) రెండు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. వీఐపీ అభ్యర్థుల్లో రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్ ఘట్లోడియా నుంచి బరిలో ఉన్నారు. అలాగే.. బీజేపీ నేత హార్దిక్ పటేల్ విరామ్‌గాం నుంచి, బీజేపీ అభ్యర్థి అల్పేష్ ఠాకూర్ గాంధీనగర్ సౌత్ రీజియన్ నుంచి పోటీ చేస్తున్నారు.

అలాగే.. దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీ బనస్కాంత జిల్లాలోని వడ్గామ్ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. గుజరాత్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సుఖ్‌రామ్ రథ్వా ..ఛోటా ఉదయపూర్ జిల్లాలోని జెట్‌పూర్ నుండి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వడోదర జిల్లాలోని వాఘోడియా నియోజక వర్గం నుంచి బీజేపీ రెబల్‌ మధు శ్రీవాస్తవ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి దేవ్‌గఢ్‌బారియా నుంచి భారత్ వఖాలా, దేవదర్ నియోజక వర్గం నుంచి  భీమా చౌదరి, గాంధీనగర్ సౌత్ నియోజక వర్గం నుంచి  డోలత్ పటేల్, విరామ్‌గామ్ నియోజక వర్గం నుంచి  కున్వర్జీ ఠాకోర్, ఘట్లోడియా నియోజక వర్గం నుంచి  విజయ్ పటేల్ లు రెండో దశలో పోలింగ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ ఎన్నికల ప్రచారం శనివారం (డిసెంబర్ 3) సాయంత్రం ముగిసింది. ఇది ఓటర్లను ప్రలోభపెట్టడానికి అన్ని పార్టీలు తమ స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించాయి.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన స్వస్థలమైన అహ్మదాబాద్‌లో ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత డిసెంబర్ 1, 2వ తేదీల్లో వరుసగా రోడ్‌షోలు నిర్వహించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా శుక్రవారం  రెండో దశ ప్రచారంలో పాల్గొన్నారు. మెహసానాలో మూడు బహిరంగ ర్యాలీలు, అహ్మదాబాద్‌లో రెండు బహిరంగ సభలు మరియు వడోదరలో రోడ్‌షో నిర్వహించారు.
  
అలాగే.. రెండవ దశ ప్రచారం చివరి రోజున ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బిజెపి అభ్యర్థులకు మద్దతునిచ్చేందుకు ధోల్కా, మహుధ , ఖంభాట్‌లలో ఎన్నికల ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించగా, కేంద్ర మంత్రి పర్షోత్తమ్ రూపాలా బనస్కాంత, ఛోటా ఉదయపూర్,ఆనంద్‌లలో ప్రచారం చేశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా రాష్ట్రంలో రెండు రోడ్‌షోలు నిర్వహించారు.

కాంగ్రెస్‌కు చెందిన శక్తిసిన్హ్ గోహిల్ చివరి రోజు దేవదర్, తరద్ , మొదాసాలో ర్యాలీలు నిర్వహించగా, క్రికెటర్,మాజీ కాంగ్రెస్ ఎంపీ మొహమ్మద్ అజారుద్దీన్ అహ్మదాబాద్‌లోని వెజల్‌పూర్, జమాల్‌పూర్ ఖాడియా,దరియాపూర్‌లలో మూడు రోడ్ షోలను నిర్వహించారు. చివరి రోజు ప్రచారం చేసిన ఆప్ నాయకులలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా గర్బడా, దాహోద్, జలోద్,  ఫతేపురాలో నాలుగు రోడ్‌షోలు నిర్వహించారు. ఆ పార్టీ గుజరాత్ ముఖ్యమంత్రి ఇసుదన్ గధ్వి కూడా చివరి రోజు సిధ్‌పూర్, కాంక్రేజ్, ధనేరా,వావ్‌లలో రోడ్‌షోలు నిర్వహించారు. 

అహ్మదాబాద్‌లో ఓటు వేయనున్న ప్రధాని మోదీ, అమిత్ షా 

డిసెంబర్ 5న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ ఎన్నికలలో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్ చేరుకున్నారు. ప్రధానమంత్రి రాణిప్ ప్రాంతంలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేయనున్నారు.  అలాగే.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ ఎంపీ అమిత్ షా నగరంలోని నారన్‌పురా ప్రాంతంలోని మున్సిపల్ సబ్ జోనల్ కార్యాలయంలో ఓటు వేయనున్నారు. సాయంత్రం అహ్మదాబాద్ విమానాశ్రయంలో దిగిన ప్రధాని గాంధీనగర్‌లోని రైసన్ ప్రాంతంలోని తన నివాసంలో తన   తల్లి హీరాబెన్‌ను కలుసుకుని ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు.

ఇతర ప్రముఖులు.

గుజరాత్‌లో చివరి దశ పోలింగ్ లో ఓటు వేయనున్న ఇతర ప్రముఖులలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఇసుదాన్ గాధ్వి, గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీష్ ఠాకోర్,  క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, హార్దిక్ పాండ్యా , కృనాల్ పాండ్యా ఉన్నారు . అలాగే.. వడోదర రాజకుటుంబం, కాంగ్రెస్ నాయకుడు , ఎంపీ శక్తిసిన్హ్ గోహిల్,  మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సింగ్ వాఘేలా కూడా నేడు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

డిసెంబర్ 1న జరిగిన తొలి దశ పోలింగ్‌లో గుజరాత్‌లో మొత్తం 63.14 శాతం పోలింగ్ నమోదైంది. కచ్, సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లోని 19 జిల్లాల్లోని 89 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది.  సగటున 63.31 శాతం ఓటింగ్ నమోదైంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న వెలువడనున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios