Asianet News TeluguAsianet News Telugu

Gujarat election: ఎన్నికలకు ముందు గుజరాత్ పర్యటనకు రాహుల్ గాంధీ

Rahul Gandhi: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గుజరాత్ లో పర్యటించనున్నారు. ప్రస్తుతం ఆయన నాయకత్వంలో భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది. గుజరాత్‌లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చాలా తక్కువ సమయం ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
 

Gujarat election: Rahul Gandhi to visit Gujarat before the election
Author
First Published Nov 18, 2022, 3:01 AM IST

Gujarat Assembly election: ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత గుజరాల్ లో రాజకీయాలు కాకరేపుతున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు ఓటర్లను తమవైపునకు తిప్పుకోవడానికి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గుజరాత్ లో పర్యటించనున్నారు. ప్రస్తుతం ఆయన నాయకత్వంలో భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది. గుజరాత్‌లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చాలా తక్కువ సమయం ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి డుమ్మాకొట్టిన రాహుల్ గాంధీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం నవంబర్ 21 నుంచి ఎన్నికల ప్రచారం చేయనున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు.

182 మంది సభ్యులున్న గుజరాత్ శాసనసభకు డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి. గుజరాత్‌లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చాలా తక్కువ సమయం ఉంటుందని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారని హిందుస్తాన్ టైమ్స్ నివేదించింది. "రాహుల్ గాంధీ కేవలం రెండు రోజులు వస్తాడని మేము ఆశిస్తున్నాము" అని పేర్కొన్నారు. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ ఐదు మండల పరిశీలకుల్లో ఒకరైన బీకే హరిప్రసాద్‌ మాట్లాడుతూ.. “రాహుల్ జీ మా ముఖ్యమైన ప్రచారకుడు. రెండు దశల ఎన్నికలకు ఆయన కచ్చితంగా ప్రచారం చేస్తారు. తొలి దశలో ఆయన దక్షిణ గుజరాత్‌, సౌరాష్ట్రలో ప్రచారం చేయనున్నారు" అని తెలిపారు. 

సౌరాష్ట్రలో మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడి ఉనికి ముఖ్యమైనది, ఎందుకంటే ఈ ప్రాంతంలో పార్టీకి బలమైన పట్టు ఉంది. 2017 అసెంబ్లీ ఎన్నికలలో, కాంగ్రెస్ సౌరాష్ట్ర ప్రాంతాన్ని క్లీన్ స్వీప్ చేసింది. ఇది అసెంబ్లీలో 77 స్థానాలను గెలుచుకోవడానికి, 182 మంది సభ్యుల సభలో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని 100 కంటే తక్కువ సీట్లకు పరిమితం చేయడానికి సహాయపడింది. అదేవిధంగా, సూరత్, దాని పరిసర ప్రాంతాలలో బీజేపీ గెలిచిన దక్షిణ గుజరాత్ లో, షెడ్యూల్డ్ తెగల బెల్ట్ లలో కాంగ్రెస్ మంచి ప్రదర్శన కనబర్చింది. రాష్ట్రంలోని 182 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 50% లేదా 90 సీట్లు సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతాలలో ఉన్నాయి. రెండో దశ ఎన్నికల్లో రాహుల్ ఉత్తర, మధ్య గుజరాత్ ప్రాంతాలను కవర్ చేస్తారని హరిప్రసాద్ తెలిపారు.

కేరళలోని వాయనాడ్ నుండి లోక్‌సభ ఎంపీ అయిన రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7 నుండి ప్రతిష్టాత్మకమైన కాంగ్రెస్ భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. ఇప్పటికే భారత్ జోడో యాత్ర తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంద్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో యాత్రను ముగించుకుని ప్రస్తుతం మహారాష్ట్రలో రాహుల్ గాంధీ పాదయాత్ర ముందుకు సాగుతోంది. కాగా, నవంబర్ 12న జరిగిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో.. రాహల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. బదులుగా భారత్ జోడో యాత్రపై పూర్తిగా దృష్టి సారించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మాత్రమే గాంధీ కుటుంబం నుండి హిమచాల్ లో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. గుజరాత్ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రచారానికి పూర్తి బలం అవసరమని పార్టీ అంతర్గత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాంగ్రెస్ 1995 నుండి గుజరాత్‌లో అధికారంలో లేదు. "2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు గుజరాత్‌లో కాంగ్రెస్ విజయం జాతీయ ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది" అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios