అగ్రకులానికి చెందిన అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడనే అనుమానంతో.. ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి మరీ దారుణంగా చితకబాదారు. ఈ దారుణ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మెహసాన పట్టణ సమీపంలోని దినోజ్ గ్రామానికి చెందిన కుర్రాడు 12వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. కాగా... ఎగ్జామ్ రాయడానికి పరీక్ష హాల్ ముందు ఉన్న  కుర్రాడిని ఇద్దరు యువకులు బలవంతంగా బైక్ పై ఎక్కించుకొని తీసుకువెళ్లారు. అనంతరం ఆ కుర్రాడిని చెట్టుకు కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు.

అనంతరం యువకుడిని వదిలేశారు. కాగా తీవ్రగాయాలతో ఉన్న కుర్రాడిని అతని తల్లి ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘పరీక్ష ఉంది వదలిపెట్టండన్నా.. అని వేడుకున్న విడిచిపెట్టలేదని బాధితుడు మీడియాతో ఆవేదన వ్యక్తం చేశాడు.

తనను తీసుకెళ్లిన వారిలో ఒకరిని గుర్తుపట్టానని, అతను గుజరాత్‌ ఆర్టీసీ కండక్టర్‌ రమేష్‌ పటేలని పోలీసులకు తెలిపాడు. ఇక ఈ ఘటన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవానీ ఆసుపత్రిలో బాధితుడిని పరామర్శించారు. 48 గంటల్లో నిందితులను అరెస్ట్‌ చేయకపోతే బంద్‌కు పిలుపునిచ్చి, ఆందోళనలు చేపడ్తామని హెచ్చరించారు.