తాను కొన్న ఆఫీసులు అప్పగించడం లేదన్న అసహనంతో ఓ డాక్టర్ తప్పుడు పనికి దిగజారాడు. ప్రధానమంత్రి కార్యాలయం పేరుతో పేక్ ఈ మెయిల్స్ పంపాడు. చివరికి సైబర్ క్రైం నేరంలో జైలు పాలయ్యాడు. ఈ ఘటన అహ్మదాబాద్ లో జరిగింది. 

అహ్మదాబాద్ నివాసి అయిన విజయ్ పరీఖ్ అనే డాక్టర్, స్థానిక పరిమళ్ గార్డెన్ ప్రాంతంలో నితీశ్ షా అనే వ్యక్తి నుండి రెండు ఆఫీసులను కొన్నాడు. అయితే కొన్ని రోజుల తరువాత నితీష్ ఆ కార్యలయాలను డాక్టర్ కి అప్పగించడానికి నిరాకరించాడు. ఎలాగైనా ఆ ఆఫీసులను దక్కించుకోవాలని, తన సమస్య పరిష్కరించుకోవాలనుకున్నాడు. దీనికోసం ఓ ప్లాన్ వేశాడు. 

ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి మెయిల్స్ వస్తే అధికారులు, పోలీసులు వెంటనే స్పందించి తనకు తక్షణ న్యాయం చేస్తారని భావించాడు. ఈ క్రమంలో పీఎంఓ కార్యాలయం అధికారుల పేరుతో గుజరాత్ ఉన్నతాధికారులతోపాటు ఐపీఎస్ అధికారులకు తన సమస్యను వివరిస్తూ మెయిల్స్ చేశాడు. 

విజయ్ అనే డాక్టర్ రెండు కార్యాలయాలను ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్టు ఆ వ్యక్తి వాటిని తన పేరిట మార్చడం లేదని తనకు న్యాయం జరిపించమని పీఎంఓ కార్యాలయాన్ని సంప్రదించినట్లు ఆ మెయిల్ లో ఉంది. రాష్ట్ర అధికారులు దీనిపై స్పందించాలని ఈ ఘటనకు సంబంధించి పీఎంఓ అధికారులు పర్యవేక్షిస్తున్నారని మెయిల్స్ లో ఉంది. 

దీనిమీద అనుమానం వచ్చిన నితీష్ సైబర్ క్రైం పోలీసులను సంప్రదించాడు. ఆ ఈ మెయిల్ ఐడీలను పరిశీలించిన సైబర్ క్రైం పోలీసులు వాటిని పరీఖ్ అనే డాక్టర్ పంపినట్లు గుర్తించారు. తన సమస్యను పరిష్కరించుకోవడం కోసం పీఎంఓ అధికారుల పేరును వాడుకున్న వైద్యుడిని అరెస్ట్ చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.