గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో భార్యాభర్తలు తమను తాము బలి ఇచ్చేందుకు గిలెటిన్ లాంటి పరికరాన్ని తయారు చేసుకుని తలలను స్వయంగా నరుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మనం అత్యాధునిక యుగంలో ఉన్నాం.. రోజురోజుకు పురోగతి సాధిస్తూ.. శాస్త్రసాంకేతిక రంగాల్లో దూసుకెళ్తున్నాం.. అయినా కొందరు మాత్రం మూఢ నమ్మకాలను పట్టుకుని వేలాడుతున్నారు. తమ జీవితాలను అంతం చేసుకుంటున్నారు. తాజాగా గుజరాత్ లో ఓ భార్యాభర్తలు తమ తలలను బలి ఇచ్చేందుకు గిలెటిన్ లాంటి పరికరంతో తలలను నరుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన రాజ్‌కోట్ జిల్లాలో చోటుచేసుకుంది. గిలెటిన్ అనే పరికరాన్ని భార్యాభర్తలు ఇంట్లోనే తయారు చేసుకున్నట్టు తెలుస్తోంది.
గుజరాత్ పోలీసులు ఏం చెప్పారు
ఈ కేసుకు సంబంధించి వించియా పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఇంద్రజిత్‌సింగ్ జడేజా మాట్లాడుతూ.. హెముభాయ్ మక్వానా (38), హంసబెన్ (35) భార్యాభర్తలు.. శనివారం అర్థరాత్రి తమ గ్రామంలోని పొలం వద్ద గుడిసెలో ఆత్మహత్యకు పాల్పడ్డారనీ, వారి తలలు చేధించే పరికరాన్ని స్వయంగా తయారు చేసుకున్నారని తెలిపారు. పరికరంలో పదునైన పెద్ద రంపాన్ని అమర్చినట్టు తెలిపారు. ఆ యంత్రం పక్కనే మంటను ఏర్పాటు చేసుకున్నారు. ఈ పరికరం కింద దంపతులిద్దరూ పడుకొని, తాడు వదలగానే .. తలలు తెగిపోయే విధంగా ఏర్పాటు చేసుకున్నట్టు తెలిపారు. మూఢనమ్మకంతోనే వారు తమను తాము బలి ఇచ్చుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
సూసైడ్ నోట్ స్వాధీనం
ఇది కాకుండా.. పోలీసులు సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో తల్లిదండ్రులు , పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని అతను తన బంధువులను కోరాడు. ప్రస్తుతం ఈ విషయంలో ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ విషయమై దంపతుల బంధువులు మాట్లాడుతూ.. గత ఏడాది కాలంగా ఇద్దరూ రోజూ గుడిసెలో పూజలు చేసుకుంటున్నారని తెలిపారు.
ఇలా జరుగుతోందని ఎవరూ ఊహించలేదని వాపోతున్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో ఇద్దరు పిల్లలు ఆనాధులుగా మారారు. వారి కన్నీటికి అడ్డులేకుండా పోయింది. ఆ పిల్లలు షాక్ నుంచి బయటపడలేకపోతున్నారు. గతంలో ఇలాంటి ఘటననే ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు కుమార్తెలను తల్లిదండ్రులే అతి కిరాతకంగా చంపిన ఉదాంతం తీవ్ర సంచలనం రేపింది.
