గుజరాత్‌లో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే అక్కడ బీజేపీని ఎదుర్కోవడం సవాలుగా మారితే.. హార్దిక్ పటేల్ వంటి డైనమిక్ లీడర్ ను పార్టీ కోల్పోయింది. దీనికి తోడు మరో సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి భరత్ సిన్హా సోలంకి కూడా ప్రజా జీవితానికి కొద్ది కాలం విరామం తీసుకుంటున్నట్టు ప్రకటించారు. తన భార్యతో కొనసాగుతున్న గొడవనే ఇందుకు కారణమైందని తెలుస్తున్నది.
అహ్మదాబాద్: గుజరాత్ కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. బీజేపీ బలమైన పట్టు సాధించిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల బరిలో గట్టి పోటీ ఇవ్వడమే టార్గెట్ పెట్టుకునేంతలా పార్టీ దిగజారింది. దీనికితోడు ఇటీవలే హార్దిక్ పటేల్‌ను కాంగ్రెస్ చేజార్చుకుంది. ఈ కష్టాలకు తోడు భరత్ సిన్హా సోలంకి ఇంటి పోరు పార్టీకి కూడా భారాన్ని తెచ్చిపెట్టింది.
కాంగ్రెస్ దిగ్గజ నాయకుడు మాధవ్ సిన్హా సొలంకి తనయుడు భరత్ సిన్హా సోలంకి 2020 అక్టోబర్‌లో కరోనా మహమ్మారితో హాస్పిటల్‌లో చేరాడు. సుమారు 100 రోజుల తర్వాత కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యాడు. ఇంత దీర్ఘకాలం హాస్పిటల్ బారిన పడిన వారు చాలా అరుదు. అందుకే ఆసియాలో ఇంత దీర్ఘకాలం కరోనాకు చికిత్స తీసుకున్న వ్యక్తి భరత్ సిన్హా సోలంకినే అని అధికారులు చెప్పారు.
అయితే, హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన బ్యాడ్ టైమ్ ముగిసిందని ఊపిరి పీల్చుకున్నాడు కానీ, శుక్రవారం ఆయన వ్యక్తిగతానికి సంబంధించిన ఓ వీడియో లీక్ అయింది. ఆ వీడియో ఆయనకు, ఆయన భార్యకు మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదాన్ని మరింత హీనస్థాయికి దిగజార్చింది. దీంతో ఆయన చాలా డిస్టర్బ్ అయ్యానని పేర్కొంటూ కొంత కాలం ప్రజా జీవితం నుంచి విరామం తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ విరామం కాంగ్రెస్‌కు మరో దెబ్బగా పరిణమించనుంది.
భరత్ సిన్హా సోలంకి, ఆయన భార్యకు మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. గత రెండేళ్లుగా స్థానిక మీడియాలో వారి మధ్య గొడవలు నానాయి. ఒకరికొకరు నోటీసులు ఇచ్చి పుచ్చుకున్నారు. తన భార్యతో సంబంధాన్ని తెంచుకున్నట్టు సోలంకి చివరకు ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడు. కాబట్టి, తన పేరును దుర్వినియోగం చేయరాదని హెచ్చరించాడు. ఆయన భార్య తన న్యాయవాదితో మరో స్టేట్ మెంట్ ఇప్పించారు. సోలంకి కరోనాతో బాధపడ్డప్పుడు ఆమె ఆయన భాగోగులు చూసుకున్నానని, అనంతరం ఆయన కోలుకున్నాక మళ్లీ ఆమెతో
దురుసుగా ప్రవర్తించారని ఆ స్టేట్ మెంట్ సారాంశం.
ఈ గొడవలతో భరత్ సిన్హా సోలంకి విసిగిపోయాడు. కొంతకాలం తన పబ్లిక్ లైఫ్‌కు దూరం ఉండాలని డిసైడ్ అయ్యాడు. విడిపోయిన తన భార్యపై దాడి చేయడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదని, ఈ వివాదమై తనకు వ్యతిరేకంగా ఎన్నో ఆరోపణలు, విమర్శలు చేశారని సోలంకి తెలిపాడు. తాను తన భార్యతో న్యాయపరమైన వివాదంలో ఉన్నాడని, ఆమెపై ఎవిడెన్స్‌ను కోర్టులో సమర్పిస్తానని వివరించాడు.
ఈ నేపథ్యంలోనే తాను పాలిటిక్స్‌కు కాస్త బ్రేక్ తీసుకుంటున్నారని, కానీ, కచ్చితంగా తిరిగి కాంగ్రెస్‌కు వస్తానని స్పష్టం చేశాడు. అయితే, ప్రజా జీవితానికి కొంత దూరం జరిగినా.. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌కు సహకరిస్తానని వివరించాడు.
