బిపర్‌జోయ్ తుపాను పశ్చిమ తీరంలో బీభత్సం సృష్టిస్తోంది. గురువారం రాత్రి బిపర్‌జోయ్ తుపాను గుజరాత్‌లోని కచ్ జిల్లాలో తీరం దాటగా.. ప్రస్తుతం బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

బిపర్‌జోయ్ తుపాను పశ్చిమ తీరంలో బీభత్సం సృష్టిస్తోంది. గురువారం రాత్రి బిపర్‌జోయ్ తుపాను గుజరాత్‌లోని కచ్ జిల్లాలో తీరం దాటగా.. ప్రస్తుతం బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే తుపాన్ ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉంది. బిపర్‌జోయ్ తుపాన్ తీరం దాటిన నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించేందుకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గాంధీనగర్‌లోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్‌లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. బిపర్‌జోయ్ తుపాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు వారి వారి జిల్లాల్లో నష్టాన్ని అంచనా వేయడానికి సర్వేలు నిర్వహించాలని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆదేశించారు. 

ఇక, వాతావరణ విభాగం ప్రకారం.. అత్యంత తీవ్ర తుపాన్‌గా ఉన్న బిపర్‌జోయ్ గురువారం రాత్రి 10:30-11:30 గంటల సమయంలో కచ్ తీరాన్ని తాకింది. జఖౌ పోర్ట్‌కు ఉత్తరాన 10 కి.మీ దూరంలో తీరాన్ని తాకింది. ఆ తర్వాత తీవ్రమైన తుఫానుగా బలహీనపడింది. రాబోయే కొద్ది గంటల్లో మరింత బలహీనపడుతుందని అంచనా వేయబడింది.

బిపర్‌జోయ్ తీరాన్ని తాకిన తర్వాతగుజరాత్‌లోని వివిధ జిల్లాల్లో అధిక వేగంతో కూడిన గాలులతో కూడిన భారీ వర్షపాతం నమోదవుతుంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. బలమైన గాలుల కారణంగా జిల్లాల్లో మౌలిక సదుపాయాల పరంగా నష్టం జరిగింది. చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు మరియు చెట్లు నేలకూలాయి. దాదాపు 1,000 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 

గోమతి ఘాట్ (ద్వారక), మాండ్వి (కచ్), భుజ్ వద్ద భారీ వర్షాలు, సముద్రంలో అలలు ఎగసిపడుతున్న దృశ్యాలు కనిపించాయి. ముంబైతో సహా పశ్చిమ తీరంలోని ఇతర ప్రాంతాలు కూడా సముద్రం అల్లకల్లోలంగా ఉంది. భుజ్, మాండ్వి, ద్వారక, జామ్‌నగర్, లఖ్‌పత్, కచ్ జిల్లా, నాలియా వంటి ప్రాంతాల్లో అధిక వేగంతో వీచిన గాలులతో చెట్లు నేలకూలాయి. పలుచోట్ల భారీగా ఆస్తి నష్టం జరిగింది. 

ఇక, భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడటంతో కనీసం 23 మంది గాయపడ్డారని, 24 జంతువులు ప్రాణాలు కోల్పోయాని ఎన్డీఆర్ఎఫ్ తెలిపింది. అయితే బిపర్‌జోయ్ తుపాను తీరాన్ని తాకక ముందే ఇద్దరు వ్యక్తులు మరణించారని పేర్కొంది. ఆ తర్వాత మానవ మరణాలు ఏవీ నివేదించబడలేదని తెలిపింది. తుపాన్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. జిల్లాల అధికార యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్ , ఇతర అధికారిక బృందాలు సుమారు 108208 మందిని ప్రభావిత జిల్లాల నుండి సురక్షితంగా తరలించారు.

గుజరాత్ ఆరోగ్య మంత్రి రుషికేష్ పటేల్ మాట్లాడుత.. ‘‘కచ్ జిల్లాలో ఇప్పటి వరకు మానవ ప్రాణనష్టం జరిగినట్లు నివేదిక లేదు. ప్రస్తుతం ముంద్రా, జఖువా, కోటేశ్వర్, లక్‌ఫట్, నాలియాలో గాలి వేగం, వర్షపాతం ఎక్కువగా ఉంది. భారీ వర్షపాతం కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు’’ అని చెప్పారు. 

ఇక, బిపర్‌జోయ్ తుపాను ప్రభావంతో గుజరాత్ 594 చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. స్తంభాలు నేలకూలడంతో గుజరాత్‌లోని 940 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జిల్లా అధికారులు, పీజీవీసీఎల్ (పశ్చిమ్ గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్) బృందాలు విద్యుత్ పునరుద్ధరణకు కృషి చేస్తున్నారు. 

ఐఎండీ తాజా బులెటిన్ ప్రకారం.. తుఫాను ప్రస్తుతం భుజ్‌కు 30 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది శుక్రవారం సాయంత్రానికి సౌరాష్ట్ర-కచ్, దక్షిణ రాజస్థాన్ మరియు పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతుందని అంచనా వేయబడింది.